కాలు తీసేస్తారేమో అనుకున్నాం కానీ కాపాడారు
అడుగు తీసి అడుగు వేయలేయలేని పరిస్థితి. తోడు ఉంటే తప్ప… బాత్రూంకు కూడా పోలేడు. హాయిగా పడుకుందామంటే… నరాలు లాగుతుంటాయి. కంటి నిండా నిద్రపోలేని దుస్థితి. ఇలా అనేక రకాల సమస్యలతో ఓ వ్యక్తి విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వచ్చారు. సమస్యలను పరీశీలించిన వైద్యులు వివిధ పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో విస్తుపోయే అంశాలను గుర్తించారు. ఈ కేసు గురించి కిమ్స్ ఐకాన్ కన్సల్టెంట్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ అమరేంద్రబాబు వివరాలను వెల్లడించారు.
విజయనగరం జిల్లా నెలివాడ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ 68 ఏళ్ల వ్యక్తి కాళ్ల నొప్పి కారణంగా నడవలేని స్థితిలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వచ్చారు. ఆయన రెండు నెలలుగా నడిచేటప్పుడు కుడి కాలి తొడ, పిక్క కండరాలలో భరించలేని నొప్పితో బాధపడుతున్నారు. రెండు నెలల క్రితం నొప్పి ఉన్నా కూడా అర కిలోమీటర్ వరకు నడవగలిగే అతను క్రమంగా.. నొప్పి ఎక్కువై కనీసం బాత్రూంకు కూడా స్వయంగా వెళ్లలేక, వేరేవాళ్ల సాయం తీసుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు నెల రోజుల నుంచి రాత్రి పూట కూడా నరాలు లాగుతుండడంతో సరిగా నిద్రపోలేని పరిస్థితి వచ్చింది. రెండు వారాల నుంచి కుడికాలి చిటికెన వేలిమీద పుండు పడి, ఇబ్బందిని మరింత పెంచింది.
సీటీ స్కానింగ్ చేసిన తర్వాత అతడి సమస్యకు గల కారణాలు గుర్తించాం. కుడికాలికి రక్తాన్ని సరఫరా చేసే పెద్ద రక్తనాళాలు (ఇలియాక్ ఆర్టరీ) పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో అతనికి అయెటో ఫిమరల్ ఆర్టరీ బైపాస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లకు జనరల్ అనస్థీషియా ఇవ్వాలి. కానీ, అతడిని పూర్తిగా పరీక్షిస్తే పలు రకాల సమస్యలు బయటపడ్డాయి. అధిక రక్తపోటు, మధుమేహం, కొవిడ్ వచ్చి తగ్గడం, దీర్ఘకాలంగా పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు బాగా పాడవ్వడం, గుండె సమస్య కూడా ఉండటం లాంటివి తెలిశాయి. దాంతో అలాంటప్పుడు జనరల్ అనస్థీషియా ఇస్తే అతడి ప్రాణాలకే ప్రమాదం.
దీంతో అతడి ఎడమ కాలి నుంచి కుడి కాలికి రక్తప్రసరణను తీసుకువెళ్లేలా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఎడమ కాలికి రక్తాన్ని సరఫరా చేసే ఇలియాక్ ఆర్టరీ కూడా ఒక చోట 95% మూసుకుపోయింది. దాంతో దాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ మరియు స్టంటింగ్ చేయడం ద్వారా మెరుగుపరిచి ఎడమ కాలిలో రక్తప్రసరణ చేశాం. ఆ తర్వాత ఎక్స్‌ట్రా ఎనటమికల్ బైపాస్ సర్జరీ ద్వారా కృతిమ గ్రాఫ్టులను ఉపయోగించి కుడికాలికి కూడా సరఫరా అయ్యేలా చేసి రోగిని సాధారణ స్థితికి తీసుకొచ్చి నడవగలిగేలా చేశాం. స్టంటింగ్, రెండు బైపాస్ సర్జరీలు చేయకపోతే అతని కాలును తొడ పైభాగం నుంచి కింది వరకు పూర్తిగా తొలిగించాల్సి వచ్చేది.
అనంతరం రోగి మాట్లాడుతూ, “నా ప్రాణాలు పోతాయని, కాలు పూర్తిగా తొలగిస్తారని భయపడ్డాను. కానీ డాక్టర్ అమరేంద్రబాబు ఆపరేషన్ చేసి కాపాడారు. కిమ్స్ ఐకాన్ యాజమాన్యానికి, డాక్టర్‌కి కృతజ్ఞతలు” అన్నారు.