భారత్ అఖండ విజయం
టీం ఇండియా టెస్ట్ చరిత్రలో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. సొంతగడ్డపై తిరుగులేని మరోమారు రుజువు చేసింది. న్యూజిల్యాండ్‌తో ఇప్పటికే టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. రెండో టెస్ట్‌లో విజయం సాధించి టెస్ట్ సిరీస్‌న్ కూడా ముద్దాడింది.
తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ భారత క్రికెట్ జట్టు వరుసగా 14వ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో బ్రహ్మాండమైన విజయం సాధించింది. 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 27 పరుగులు జతచేసి న్యూజిలాండ్ మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు అశ్విన్, జయంత్ యాదవ్ నాలుగు వికెట్ల చొప్పున తీయగా… మరో వికెట్ ఎడంచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ ఖాతాలోకి వెళ్లింది. ఈ గెలుపుతో భారత్ రెండు టెస్టుల సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీ… రెండు టెస్టుల్లో పొదుపుగా బౌలింగ్ చేసి మొత్తం 14 వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారంతోపాటు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీ లభించాయి. కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత్ రెండో సిరీస్‌ను దక్కించుకుంది.