యాగంటి క్షేత్ర ప్రాముఖ్యత
రచయిత్రి – మీనాక్షి
భారతావని ఆధ్యాత్మికతకు,హైందవ శక్తి కి ప్రతీక మాత్రమే కాదు మనిషిని ప్రకృతి ఒడిలో సేద తీరుస్తూ ఆహ్లాదకరమైన సౌందర్యం తో పరవడింపచేసే ఎన్నో దివ్య క్షేత్రాలకు పుట్టినిల్లు. అటువంటి ఆలయాలలో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని శ్రీ బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి పట్టణానికి 14.కి.మీ దూరం లో ఉన్న పాటపాడు అనే గ్రామ సమీపంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలము.
రమణీయ ప్రకృతి రారమ్మన్నట్టుగా ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నట్టు చుట్టూ పచ్చని కొండలు, గుహల మధ్య ఇది మానవ నిర్మితమా లేక కైలసమా అన్నట్టు మైమరపించే దేవాలయ ప్రాంగణం మంత్రముగ్ధులను చేస్తుంది.
ఈ దేవాలయ శోభను మాటలలో వర్ణించడం మానవ మాత్రులకు సాధ్యం కాదేమో స్థలపురాణం ప్రకారం వేద మహర్షి అయన అగస్త్య మహా మునీశ్వరుడు ఇక్కడ కలియుగ దైవం శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి ఈ ఆలయాన్ని నిర్మించారు కాని విగ్రహ ప్రతిష్టించదలచిన విగ్రహం కాలి బొటనవేలి గోరు విరిగిపోవడం వల్ల వేంకటేశ్వర విగ్రహ ప్రతిష్ట కాలేదట. నిరాశకు గురైన మునీశ్వరుడు శివుని కొరకు తపస్సు చేశాడట అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశం సాక్షాత్తు కైలాసాన్ని తలపిస్తోంది కనుక ఇక్కడ శివుణ్ణి ప్రతిష్టించమని ఆదేశించాడట. అప్పుడు అగస్తుడు లింగ రూపంలో ఉన్న శిల పైన పార్వతి సమేతుడై ఉమామహేశ్వర స్వామీ గా దర్శనం ఇవ్వాలని శివుని కొరాడుట అందుకు శివుడు అంగీకరించి పార్వతి సమేతుడై ఒక శిలపై వెలిశాడని అదే ఈ క్షేత్ర విశేష ప్రత్యేకతగా పెద్దలు చెపుతారు ఇక్కడ ముఖ మండపం లో స్వయంభువు గా వెలసిన బసవన్న విగ్రహం లో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది ఈ బసవన్న సంవత్సరానికి ఒక అంగుళం పెరుగుతూ ఉన్నట్టుగా పురావస్తుశాఖ కూడా నిర్ధారణ చేయడంతో ఎంతో మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగం అంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది కలియుగాంతం తో ముడి పడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది . ప్రధాన గోపురం ఐదు అంతస్థుల కలిగి ఉంటుంది. దీనిని దాటగానే రంగ మండపం, ముఖ మండపం , అంతరాలయం ఉంటాయి. ఈ యాగంటి పరిసర ప్రాంతాలలో కాకులు ఎక్కడా కనిపించవు ఈ ఆశ్చర్యకరమైన విషయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందట. అగస్త్య మహాముని కి తపోభంగం కవించడం వల్ల ముని కాకులు ఇక్కడ కనిపించవు అని శపించినట్టుగా పురాణ గాధ ఉంది. పార్వతి సమేతుడైన ఈశ్వరుణ్ణి దర్శించుకున్న తరువాత ఇదే క్షేత్ర ప్రాంగణం లో ఉన్న అగస్త్య మహాముని గుహ, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ కానీ విగ్రహం ఉన్న గుహను కూడా దర్శించుకొని అనిర్వచనీయమైన అలౌకిక ఆనందాన్ని పొందవచ్చు. ఈ క్షేత్రం లో పుష్కరణి మరొక ఆకర్షణ ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నందీశ్వరుని నోటి నుండి ఆలయ ప్రాంగణం లో కోనేటి చేరుతుంది ఏ కాలం లో నైనా ఇక్కడ పుష్కరిణీ నీరు ఒక మట్టం లో ఉండడం విశేషం ఈ పవిత్ర జలం ఔషధ గుణాలు కలిగి సర్వ వ్యాధులు నివారిస్తుంది అని భక్తుల విశ్వాసం పుష్కరిణీ నుండి ఆలయానికి వెళ్ళడానికి ఒక సోపాన మార్గం ఉంది.
ప్రతీ సంవత్సరం శివరాత్రి పర్వదినం మరియు కార్తీక మాసం లో ఇక్కడ విశేష పూజలు ఘనం గా నిర్వహిస్తారు. ఇది నేను చూసిన తరించిన యాగంటి ప్రత్యేకత.