ఘనంగా ప్రారంభమైన మిసెస్ మామ్ 2021 సీజన్ 5
గర్భం దాల్చడం ప్రతి జంట జీవితగ్రంథంలో ఓ అందమైన పేజీ. ఈ సమయాన్ని మరింత గుర్తుండిపోయేలా, ఆరోగ్యకరంగా, అందంగా చేసి.. కలిసి ఉండటాన్ని ఇంకొంత పెంపొందించడానికి వచ్చేస్తోంది.. మిసెస్ మామ్ 2021 సీజన్ 5. ఈ పోటీలను కిమ్స్ ఆసుపత్రికి చెందిన కిమ్స్ కడిల్స్ తల్లీబిడ్డల ఆసుపత్రి క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె.శిల్పిరెడ్డి రూపొందించారు. ఇది గర్భంతో ఉన్న మహిళలు, వారి భర్తలకు ఆరోగ్య వేడుక. గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు, ఇది ఐదో సంవత్సరం. ఇవి 2017లో తొలిసారి ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం.. అంటే 2020లో కొవిడ్-19 సంక్షోభం ఉన్నా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో పెద్దసంఖ్యలో పోటీదారులు ముందుకొచ్చారు. ఈ సారి నిర్వహించే పోటీ వివరాలను డాక్టర్ శిల్పిరెడ్డి వివరించారు. అవి ఇలా ఉన్నాయి…
ముఖ్యమైన తేదీలు ఇవీ..
మిసెస్ మామ్ 2021 సీజన్ 5 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 70 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 3 నుంచి 9 నెలల గర్భంతో ఉన్న మహిళలెవరైనా ఇందులో పాల్గొనచ్చు. రిజిస్ట్రేషన్ల కోసం గర్భిణులు సంప్రదించాల్సిన నెంబర్లు: 9503606049 / 8247219948. నవంబర్ 28న పాల్గొనేవారందరికీ ఉచితంగా స్క్రీనింగ్ చేసి, వారి రిస్క్ కేటగిరీని అంచనా వేస్తారు. వాళ్లలో ఎవరికైనా సమస్యలున్నా, తగిన జాగ్రత్తలు తీసుకుని పాల్గొనేలా చేయొచ్చు. అదే రోజు అందరికీ ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 29న బ్రహ్మకుమారీలతో సదస్సు ఉంటుంది. అందులో అద్భుతమైన పిల్లలను ఎలా కనాలో వారు వివరిస్తారు. ఇందుకోసం ముంబై నుంచి ఇద్దరు వక్తలు వస్తున్నారు. భావోద్వేగాల పరంగా, ఆధ్యాత్మికంగా పుట్టబోయే పిల్లలు ఎలా ఆరోగ్యకరంగా ఉండాలో చెప్పడంతోపాటు మన శరీరం, మనసు, ఆత్మ సంరక్షణ గురించి కూడా వివరిస్తారు. ఇది కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే కాదు.. మన శరీరం, మనసు గురించి కూడా అన్నమాట.
గ్రాండ్ ఫినాలె ఎప్పుడు.. ఎక్కడ
మిసెస్ మామ్ 2021 సీజన్ 5 పోటీల గ్రాండ్ ఫినాలె ద హెచ్ఐసీసీ నోవోటెల్ హోటల్లో డిసెంబర్ 5న జరుగుతుంది. ఇందులో 40 మంది ఫైనలిస్టులు ర్యాంప్ మీద నడుస్తారు. అయితే, వారంతా ఫ్యాషన్ దుస్తులు కాకుండా భారతదేశం నలుమూలలకు చెందిన చేనేత కార్మికులు తమ స్వహస్తాలతో నేసిన సహజ వస్త్రాలే ధరించడం విశేషం. వారు నేసిన చీరల నుంచి దేశీ కాలర్ సంస్థకు చెందిన డిజైనర్ మానసి అగర్వాల్ అద్భుతమైన వివిధ రకాల దుస్తులను రూపొందించారు. అవన్నీ గర్భిణులకు అనుకూలంగా, వారి అవసరాలు తీర్చేలా ఉంటాయి. వీఐపీలు, సినీపరిశ్రమ పెద్దలు, రాజకీయ నాయకులు, అన్ని విభాగాలకు చెందిన వైద్యనిపుణులు, ఆరోగ్య, ఫ్యాషన్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు… ఇలా అందరూ కలిపి దాదాపు 500 మంది విశిష్ట అతిథులు గ్రాండ్ ఫినాలెలో పాల్గొంటారు.
నినాదాలు
ఈసారి మిసెస్ మామ్ 2021 సీజన్ 5 సందర్భంగా మూడు ప్రధానమైన నినాదాలను తీసుకున్నట్లు డాక్టర్ శిల్పిరెడ్డి వివరించారు. అవి…
సరైన ఆహారమే తీసుకుందాం
మనమంతా, ముఖ్యంగా గర్భిణులు మన స్థానిక, సంప్రదాయ, సీజనల్ ఆహారమే తీసుకోవాలి. బయటి ఆహారం, నిల్వ ఉండేందుకు కలిపేవి, పురుగుమందులు వేసినవి, జంక్ ఫుడ్ లాంటివాటిని పూర్తిగా వదిలేయాలి. మన పూర్వీకులు తినే ఆహారాన్ని తిరిగి తెచ్చుకుందాం. అప్పుడే మనకు అనారోగ్య సమస్యలు, ఊబకాయం లాంటివి దరిచేరవు. ఇదే సరైన సమయం. గర్భిణిగా ఉన్నప్పుడు సరైన ఆహారపు అలవాట్లు చేసుకుంటే, తర్వాతి తరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
నేతన్నలకు అండాదండా
కరోనా తర్వాత చేనేత కళాకారులపై తీవ్రంగా ప్రభావం పడింది. వాళ్లు ఎక్కువగా హస్తకళలపైనే ఆధారపడ్డారు. కానీ సింథటిక్ వస్త్రాలు వచ్చాక అవి చవక కావడంతో, ఎవరూ కొంత ఖరీదైన చేనేత దుస్తులు ధరించడం లేదు. కానీ చేనేత వస్త్రాలైతే శరీరానికి, చర్మానికి ఎంతో ఆరోగ్యకరం. వాటితో వచ్చే సౌఖ్యం గర్భిణులకు చాలా అవసరం. ఇక్కడ మేము కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలకు చెందిన దాదాపు 40 మంది చేనేత కార్మికులు రూపొందించిన వస్త్రాలు తీసుకొచ్చాం. వారందరి సమాచారం కూడా మాదగ్గర ఉంది. వారికి మేం అండదండలు అందిస్తున్నాం. ఈ చీరల నుంచి గర్భిణులకు అనుకూలంగా ఉండేలా దుస్తుల డిజైన్లను మానసి అగర్వాల్ రూపొందించారు.
భరణీయ జీవితం
మనం నిరంతరం వాడే ఆహారం, ప్లాస్టిక్ పదార్థాలు, వీటన్నింటివల్ల భూతాపం పెరిగిపోతోంది, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇతర దేశాల్లో తయారైన ఉత్పత్తులు కాకుండా, మనకు 50-100 కిలోమీటర్లలోపు దూరం ఉన్నచోట తయారయ్యే వస్తువులు కొంటే రవాణా రూపంలో కార్బన్ ఫుట్‌ప్రింట్ కూడా తగ్గుతుంది. అప్పుడే మనం భూతాపాన్ని అరికట్టగలం. మనం నిరంతరం వాడే వస్తువులను పరిమితం చేసుకుని, దుస్తులు, ఆహారం, వస్తువుల లాంటివి బాగా అవసరమైనవే వాడితే కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గుతుంది. భూతాపాన్ని తగ్గిస్తేనే తర్వాతి తరాలకు సురక్షితమైన భూమిని మనం అందించగలం. ఇప్పటికే ఈ భూతాపం వల్ల వరదలు, వేడి, చలి, వర్షాలు అన్నీ పెరిగిపోయాయి. ఇకనైనా మనం మన భూగ్రహాన్ని కాపాడుకోవాలి.
కార్యక్రమ లక్ష్యం, ఈవెంట్ ముందు కార్యక్రమాలు ఇలా ఉంటాయి…
- గర్భం గురించి మాతృత్వ అవగాహన పెంపొందించడం.
- గర్భిణుల సంరక్షణలో భాగస్వాముల పాత్రను ప్రోత్సహించడం.
- గర్భసంస్కార యోగను బోధించడం, ఆరోగ్యకరమైన వ్యాయామాలతో మెరుగైన ఫలితాలు.
- లామేజ్ మరియు ప్రసవానికి సంబంధించిన విషయాలపై అవగాహన పెంచి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం.
- చిన్నపిల్లలను పెంచడం, వారికి పాలివ్వడంలో భార్యాభర్తలకు శిక్షణ, తద్వారా పిల్లల సంరక్షణ, కుటుంబ సంబంధాలలో విశ్వాసాన్ని పెంపొందించడం.
- ఒత్తిడి నివారణ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసంతో సమగ్రాభివృద్ధి సాధించడం.
- వాటర్ యోగా లేదా వోగాతో శరీరం వంగేగుణాన్ని, బలాన్ని పెంపొందించడం, సాధారణ ప్రసవాల రేటును పెంచడం.
- చర్మసంరక్షణ, దంత సంరక్షణ గురించి చెప్పి, ఆత్మవిశ్వాసంతో మనసారా నవ్వడం ద్వారా ప్రసవాన్ని సులభతరం చేయడం.
- ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఆహారం, ఇంటి పంటల గురించి, వాటి ప్రాధాన్యం గురించి చెప్పి, స్థానిక, సంప్రదాయ, సీజనల్ ఆహారం తినేలా ప్రోత్సహించడం.
- గర్భం దాల్చినప్పుడు, ప్రసవం తర్వాత పాత ఆహారం, వంటకాలను తయారుచేసే విధానాల్లో శిక్షణ ఇవ్వడం, వాటివల్ల కలిగే ప్రయోజనాలు చెప్పడం. వేగంగా, పోషకాలతో, రుచికరమైన ఆహారాన్ని వండటం, జంక్ ఫుడ్ నివారించడం.
- దేశం నలుమూలల ఉన్న చేనేతలకు మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమంలోని సామాజిక కోణం. చేతులతో నేసిన చీరలు, వస్త్రాలను ఫ్యాషన్ దుస్తుల్లా మార్చి, అందమైన గర్భిణులు ధరించేలా చేయడం.
- మేడిన్ ఇండియా కార్యక్రమానికి మద్దతిచ్చి, హస్తకళలను ప్రోత్సహించడం, దానిమీద ఆధారపడినవాళ్లకు మహమ్మారి సమయంలో జీవనోపాధి కల్పించడం.
గర్భం దాల్చిన సమయంలో మిమ్మల్ని మీరు మళ్లీ కనుక్కోవచ్చు, భార్యాభర్తల మధ్య సంబంధాలు బలోపేతం చేయడం, కుటుంబసభ్యుల బాంధవ్యాలు పెంపొందించడం ద్వారా మిసెస్ మామ్ పోటీ మీ అనుబంధాలన్నింటినీ మళ్లీ ఒకచోట చేరుస్తుంది. నిపుణుల మార్గదర్శనంలో మీరు, మిమ్మల్ని ప్రేమించేవారిని దగ్గరచేస్తుంది.