మండ‌లిపై పాగా వేస్తున్న వైకాపా

ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయితే శాసనమండలిలో అధికార వైఎస్సార్‌సీపీ సంపూర్ణ ఆధిపత్యం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శాసనసభ, స్థానిక సంస్థల్లో రాజకీయ పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే 14 ఎమ్మెల్సీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. అప్పుడు మండలిలో వైఎఎస్సార్‌సీపీ సభ్యుల సంఖ్య 18 నుంచి 32కు పెరుగుతుంది. శాసనసభ తరహాలోనే శాసనమండలిలోనూ వైఎస్సార్‌సీపీకి తిరుగులేని ఆధిపత్యం లభిస్తుంది. దీనివల్ల ప్రజాభ్యుదయం, రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, అమలు చేయడానికి ప్రభుత్వానికి మరింత వెసులుబాటు ఉంటుందని రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శాసనమండలిలో సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి రెండున్నరేళ్లుగా సైంధవుడిలా అడ్డుపడుతున్న చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు తెర పడుతుందని పేర్కొంటున్నారు.