సినిమాకెళ్లిన మంత్రి… వద్దన్న సీఎం కేసీఆర్
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ‘రైతన్న’ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ సినిమా దర్శకనిర్మాత, నటుడు నారాయణమూర్తితో కలిసి హనుమకొండలోని అమృత థియేటర్‌కు వచ్చారు. అయితే సినిమా ప్రారంభం అవుతున్న సమయంతో సీఎం కేసీఆర్ నుంచి మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ వచ్చింది. వెంటనే హైదరాబాద్‌కు రావాలని చెప్పడంతో సినిమా చూడకుండానే మంత్రి ఎర్రబెల్లి వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. నారాయణమూర్తి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు. రైతన్న సినిమా ద్వారా రైతుల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన ఆయనకు అభినందనలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, కానీ మోదీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు శాపంగా మారాయని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. ఇక నారాయణమూర్తి మాట్లాడుతూ.. రైతుల సమస్యలు ప్రపంచానికి తెలిపే సినిమా ‘రైతన్న’ అని, ఈ సినిమాను అందరూ చూడాలని కోరారు. అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే కొత్త రైతు చట్టాలను తెచ్చారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రైతు సమస్యలపై పోరాడిన తీరు అద్భుతమని ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు.