క‌శ్మీర్ కోసం తాలిబ‌న్ల సాయం : పీటీఐ

పాకిస్థాన్ త‌న వ‌క్రబ‌ద్దిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టుకుంది. కాశ్మీర్‌ను తమ దేశ అధీనంలోకి తీసుక‌రావ‌డానికి తాలిబ‌న్లు స‌హ‌క‌రిస్తారంటూ సంచ‌ల‌న‌ల వ్యాఖ్యాలు చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే…. ఆఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంలో కీలక పాత్ర పోషించిందంటూ.. పాకిస్థాన్, ఆ దేశ సీక్రెట్ సర్వీస్‌పై ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన ఒక నేత ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేలా మాట్లాడారు. ఒక లైవ్ షోలో మాట్లాడిన పాక్ అధికార పార్టీ పాకిస్థాన్ టెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత నీలం ఇర్షాద్ షేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్ విషయంలో మనకు సాయం చేసేందుకు తాలిబన్లు సుముఖంగా ఉన్నారు’’ అని ఆమె అన్నారు. ఈ మాటలు విన్న యాంకర్ ఆశ్చర్యపోయారు. ‘మేడమ్, మీరేమంటున్నారో మీకన్నా అర్థమవుతోందా? మీకర్థం కావడంలేదు. ఈ షో ప్రపంచం మొత్తం ప్రసారమవుతుంది. ఇండియాలో కూడా ఇది చూస్తారు’’ అని యాంకర్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే యాంకర్ మాటలను పట్టించుకోని పీటీఐ నేత.. తాలిబన్లు అవమానకరమైన ప్రవర్తన ఎదుర్కొన్నారని, అందుకే తమకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని స్పష్టంచేశారు. కాగా, ఆఫ్ఘన్ పగ్గాలు అందుకున్న అనంతరం తాలిబన్లు పలు అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో కశ్మీర్ సమస్య గురించి కూడా మాట్లాడిన తాలిబన్లు.. అది భారత్ అంతర్గత, ద్వైపాక్షిక సమస్య అని స్పష్టంచేశారు. దానిలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పారు. కానీ ఇప్పుడు నీలం చేసిన వ్యాఖ్యలతో తాలిబన్ల ప్రకటనపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.