హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
*గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యుల విశ్లేషణ
*వర్షాకాలం, పారిశుధ్య లోపంతో వైరల్ జ్వరాల తీవ్రత
హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని నగరంలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి అయిన లక్డీకాపుల్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దోమకాటు వల్ల డెంగ్యూ వస్తుంది. ఒక్కోసారి దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండి, చివరకు మరణం కూడా సంభవిస్తుంది. కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ కారక దోమల నుంచి ప్రజలు రక్షణ పొందవచ్చు.
కేసుల సంఖ్య పెరగడంపై గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ వై. ప్రశాంత్ చంద్ర మాట్లాడుతూ, “వర్షాకాలం కావడంతో పాటు పారిశుధ్యం సరిగా లేకపోవడం వల్ల నగరంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా కనీసం 40-50% పెరుగుదల ఉందని మేం గమనించాము. సాయంత్రం తర్వాత, తెల్లవారుజామున డెంగ్యూకారక దోమలు బాగా చురుగ్గా ఉంటాయి. ఈ సమయంలో వాకింగ్ కోసం వెళ్లేవారు పారిశుధ్య పరిస్థితులు సరిగా లేనిచోట ఉంటే వీటి కాటుకు గురవుతారు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీళ్లు నిల్వ ఉన్నచోట నడవకుండా ఉండటం లాంటి చర్యలతో డెంగ్యూను నివారించవచ్చు. జ్వరం వచ్చినవాళ్లు తప్పనిసరిగా పరీక్ష చేయించుకుని ముప్పును అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం” అని డాక్టర్ ప్రశాంత్ చంద్ర వివరించారు.
“లక్డీకాపుల్ లోని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి డెంగ్యూ జ్వరాలపై అవగాహన కలిగించేందుకు అనేక చర్యలు తీసుకుంది. డెంగ్యూ జ్వరాలు పెరగడం వల్ల వాటిని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితుల్లో ఇలాంటి సీజనల్ వ్యాధుల ప్రభావం మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదముంది” అని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి (లక్డీకాపుల్) సీఈవో గౌరవ్ ఖురానా తెలిపారు.