‘‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్”లో ఏకైక ఆసియావాసి కిమ్స్ డాక్టర్ సందీప్ అత్తావర్
డెక్కన్ న్యూస్, హెల్త్ బ్యూరో :
హైదరాబాద్, జులై 29, 2021: కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ సందీప్ అత్తావర్ మరో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు అందరికీ రాబోయే ఏడు సంవత్సరాలకు అవయవమార్పిడి గైడ్‌లైన్స్ సూచించే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌లో ఏకైక భారతీయ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడిగా నిలిచారు.
అవయవ మార్పిడి రంగంలో చాలా కఠినమైన నియంత్రణలుంటాయి. ఇందులో ఊపిరితిత్తుల మార్పిడి చాలా కొత్తది. గత కొన్ని దశాబ్దాలలో దాదాపు వ్యాధి చివరిదశలో ఉన్న రోగుల నుంచి క్లినికల్ డేటాను సేకరిస్తున్నారు. ప్రతి ఏడేళ్లకోసారి ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను అందరూ అంగీకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఊపిరితిత్తుల మార్పిడి కేంద్రాల్లో ఈ నియమాలను పాటించడం ప్రామాణికంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ కమిటీలో ఉన్న 24 మంది ప్రముఖ ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుల్లో డాక్టర్ సందీప్ అత్తావర్ మొట్టమొదటి భారతీయ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు. ఇంకా చెప్పాలంటే ఆసియా ఖండం మొత్తంలో ఈ కమిటీలో నియమితులైంది ఈయనొక్కరే. ఈ అత్యున్నత స్థాయి కమిటీ ఊపిరితిత్తుల మార్పిడికి వ్యక్తులను ఎంపిక చేయడానికి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. రాబోయే దశాబ్దం పాటు ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల మార్పిడిలో పాటించాల్సిన పద్ధతులను ఈ నివేదిక స్పష్టం చేస్తుంది.
ఈ సందర్భంగా డాక్టర్ అత్తావర్ మాట్లాడుతూ, “ఈ గౌరవం దక్కినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. అత్యున్నత కమిటీలో స్థానం దక్కడం విశేషం. ఇది సాకారం కావడంలో నాకెంతో మద్దతుగా నిలిచిన నా బృంద సభ్యులందరికీ, కిమ్స్ ఆసుపత్రికి నా ధన్యవాదాలు. ఈ కొత్త మార్గదర్శకాలు మరింత స్పష్టత ఇవ్వడానికి దోహదపడతాయి, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్న సందర్భాల్లో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులకు, పల్మనాలజిస్టులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. భారతదేశంలో ఊపిరితిత్తుల మార్పిడికి మేం పునరంకితులు అవుతాం” అన్నారు.
కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ, “కొవిడ్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి డాక్టర్ అత్తావర్, ఆయన బృందం అవిశ్రాంతంగా పనిచేసి, ఊపిరితిత్తులు బాగా పాడైనవారికి సరికొత్త జీవితం అందిస్తున్నారు. ఇప్పుడు సాధించిన విజయం భవిష్యత్తులో మరిన్ని విజయాలకు బాట వేస్తుందన్న నమ్మకం నాకుంది” అని చెప్పారు.