కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో అరుదైన గుండె శస్త్ర చికిత్స
– మహిళ ప్రాణాలు కాపాడిన డాక్టర్లు
– జిల్లాలోనే మొట్ట మొదటి విజయవంతమైన వాల్వ్యులర్ సర్జరీ
కర్నూలు జిల్లాలోని కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న యువతికి సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి ప్రాణాలు కాపాడారు. అనంతపురం జిల్లా.. మోమినాబాద్‌కు చెందిన గృహిణి షేక్ జబీనా తబస్సుమ్(22) అనే మహిళ ఒక వారం రోజుల నుంచి ఛాతినొప్పి మరియు వెన్నునొప్పితో పాటు గత రెండు నెలలుగా ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుండడంతో ఆమె కిమ్స్ కర్నూలు ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరిశీలించిన డాక్టర్లు గుండె సంబంధిత సమస్యలుండొచ్చ అనుమానంతో ముందుగా ఎకో కార్డియోగ్రామ్ టెస్ట్ చేశారు. అనంతరం మహాధమని ని సీటీ స్కాన్ చేయగా గుండెలోని అయోర్టిక్ ద్విపత్ర కవాటం రెండుగా విభజించబడిన అరుదైన(వాల్వ్యులర్ గుండె వ్యాధి) లక్షణాలు కనిపించాయి. మహాధమని బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ముఖ్యంగా ఈ గుండె సమస్య పుట్టుకతోనే వస్తుంది. ఈ ధమని చీలి ఉండటం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారని.. వీరికి శస్త్ర చికిత్స చేయటం చాలా గొప్పవిషయమని వైద్యులు తెలిపారు. జిల్లాలోనే విజయవంతమైన మొట్టమొదటి చికిత్సగా డాక్టర్లు వివరించారు.
ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ కె. సందీప్ రెడ్డి వ్యాధి తీవ్రత, చికిత్సా విధానాన్ని వివరించారు. ‘‘సాధారణంగా ఇటువంటి కేసులను మేము 50-70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా చూస్తుంటాం. అదే విధంగా హైపర్ టెన్సివ్ ఉన్నవారిలో మరియు కొన్ని పుట్టుకతో వచ్చే సిండ్రోమ్స్లో కూడా ఇలాంటి కేసులను చూస్తాం. సాధారణంగా, మహాధమని కవాటంలో మూడు కరపత్రాలు ఉంటాయి కాని పుట్టుకతో వచ్చే సమస్య కారణంగా ఈ మహిళకు కేవలం రెండు కవాటాలు మాత్రమే ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో, ప్రారంభంలో, మహాధమని సంబంధ సమస్య మొదలవుతుంది. తరువాత ధమని సంబంధిత వాపుతో చివరకు విచ్ఛిన్నమవుతుంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా, ఒక మిలియన్ జనాభాలో 5-30 కేసులు మాత్రమే ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. వయస్సు పెరిగేకొద్దీ, వాల్వ్ బిగువుగా మారి సమస్యలు మొదలవుతాయి. మహా ధమని యొక్క సాధారణ పరిమాణం 2-3 సెం.మీ. కానీ, ఈ వ్యాధి ఉన్నవారిలో ఇది 5.5 సెం.మీ పరిమాణంలో ఉంది. వారు కొంచెం ఎక్కువ నడిచినా, గుండె మీద ప్రెషర్ పెట్టే పనులు చేసినా.. మహాధమని చీలిపోయి కొద్ది నిమిషాల్లోనే మరణం సంభవిస్తుంది.” అనిపేర్కొన్నారు.
‘‘ఇలాంటి సందర్భాల్లో, ప్రాణాలను కాపాడటానికి వీలైనంత త్వరగా సర్జరీ చేయాలి. ఈ తరహా సంక్లిష్టమైన సర్జరీ చేసేందుకు ‘బెంటాల్స్ విధానం’ మాత్రమే సరైన పద్ధతి. ఇది క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలలో ఒకటి. ఈ విధానంలో కిమ్స్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలీసౌదగర్, అనస్థీషియా డాక్టర్ విజయసాయి సహకారంతో చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాం. కర్నూలు జిల్లాలో విజయవంతమైన మొట్టమొదటి వాల్వ్యులర్ గుండె వ్యాధి సర్జరీ. 3 శస్త్రచికిత్సలు గతంలో చేసినప్పటికీ, పేషెంట్ల ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ అధునాతన విధానానికి మొత్తం రూ. 8-10 లక్షలు అవుతుంది. కానీ పేషెంట్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలోనే చేశాం. ఈ తరహా వ్యాధుల్లో సాధారణంగా, 60-70% మంది రోగులు చికిత్స తీసుకోక పోవడం వల్ల చనిపోతుంటారు. చికిత్స తీసుకున్నా.. ఆస్పత్రుల్లో మరణాల రేటు కూడా 20-30% వరకు ఉంటుంది. ఈ సర్జరీ సమయంలో రక్తస్రావం మరియు ఇతర సమస్యలు ఉత్పన్నమై ప్రాణాపాయం జరుగుతుంది.”అని వివరించారు.
శస్త్ర చికిత్స అనంతరం పేషెంట్‌ను 8 రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి ఆమె దినచర్యలు సక్రమంగా చేసుకుంటూ హుషారుగా ఉండటంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించాం. కిమ్స్ హాస్పిటల్ కర్నూలు ఎంతో నిష్ణాతులైన డాక్టర్ల బృందంతో పాటు అధునాతనమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉండడంతో అరుదైన శస్త్ర చికిత్సలను సైతం విజయవంతంగా చేస్తున్నామని డాక్టర్ కె. సందీప్‌రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా జబీనా తబుస్సమ్ ప్రాణాలు నిలబెట్టిన కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లకు, వైద్యసిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.