రేవంత్ మార్క్ – కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న నేతలు
ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వైభవం మారిపోయింది. రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వగానే కొంత మంది సీనియర్ నేతలు వ్యతిరేకించారు. గతంలో కాంగ్రెస్‌ను వీడిన నేతలందరూ ఇప్పుడు తిరిగి హస్తం గూటికి చేరుతున్నారు. ఇది చూస్తుంటే పార్టీకి తిరిగి పూర్వవైభవం వచ్చేటట్లు ఉందంటున్నారు సీనియర్ రాజకీయ నేతలు. రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత పార్టీలో ఉన్న అసమ్మతి వర్గానికి చెక్ పెట్టేలా చేశారు. అనంతరం పార్టీ చేరికల మీద దృష్టి సారించారు.
ఇప్పటికే భాజపా, తెలుగుదేశం, తెరాస నుండి వలసలు ప్రారంభమైనాయి. పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న వారిలో నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా ఉన్నారు. సంజయ్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు. సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, భూపాలపల్లి బీజేపీ నేత గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు.
దీనిపై ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగానని, తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కోసమే టీఆర్ఎస్ లో చేరానని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని వివరించారు.
అటు, మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎర్ర శేఖర్ ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.
టీపీసీసీ అధ్యక్ష పదవిలోకి వచ్చాక రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్షించడంలో సఫలమవుతున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు అప్పగించడంతో కాంగ్రెస్ పుంజుకోవడంపై అంచనాలు బలపడుతున్నాయి.