కృష్ణ‌కాంత్ పార్కులో సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం యూసుఫ్‌గూడలోని కృష్ణ‌కాంత్ పార్కులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా పాల్గొని, ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దాంతోపాటు శిబిరంలో పాల్గొన్న వైద్యుల నుంచి సలహాలు పొందారు.

ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో రక్తపోటు, ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ లాంటి పరీక్షలు చేశారు. సెంచురీ ఆస్పత్రి డీఎంఓ డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి శిబిరానికి వచ్చి, ఈ పరీక్షల ఫలితాలను విశ్లేషించి, భవిష్యత్తులో ఏం చేయాలో ‘వారికి తెలిపారు. ఇప్పటికి ఉన్న, లేదా ఉన్నాయని భావిస్తున్న సమస్యల కోసం మరిన్ని పరీక్షలు చేయించుకోవాలనుకునేవారికి సెందురీ ఆస్పత్రి కొంత రాయితీని ప్రకటించింది.

ఈ సందర్భంగా సెంచురీ ఆస్పత్రి సీఈవో డాక్టర్ హేమంత్ కౌకుట్ల‌ మాట్లాడుతూ, “ఆరోగ్యం కోసం నడవడం అనేది మనిషి చేయగలిగిన అత్యంత మంచి పనుల్లో ఒకటి. అన్ని వయసులవారూ రోజూ కొంత దూరం నడవడం, ఎంతో కొంత వ్యాయామం చేయడం లాంటి మంచి అలవాట్లు చేసుకోవాలి. కృష్ణ‌కాంత్ పార్కులాంటి చోట్ల ప‌చ్చ‌ద‌నం ఉండటం, కాలుష్యానికి దూరంగా ఉండ‌టంతో ఇక్క‌డ న‌డ‌వ‌డం మంచిది. అంద‌రూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించాం. సెంచురీ ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది అంతా ఈ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడేవారికి మద్దతుగా నిలుస్తున్నారు” అని చెప్పారు. శిబిరంలో సెంచురీ ఆస్పత్రికి చెందిన వైద్యసిబ్బంది, నర్సులు పాల్గొని ప్రజలకు పరీక్షలు చేశారు.