భాజ‌పాకి క‌లిసొచ్చిన 2020

ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే 2020 కి ఓ ప్రాధాన్య‌త ఉంది. క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ దేశాల‌ను ఆర్థికంగా ఓ కుదుపు కుదిపేసింది. కానీ రాజ‌కీయంగా మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీకి క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పుకోవాలి. ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా పార్టీ నినాదం ప్ర‌తి గ్రామానికి చేరుకుంది. టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టింది. అసలు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను అస్తవ్యస్తం చేసింది. రాష్ట్రంలో బీజేపీ ఈ ఏడాది అనూహ్యంగా… ఊహించని విధంగా బలపడింది. ఏ పార్టీ ఊహించని రీతిలో అధికార పార్టీని దెబ్బకొట్టింది. కేవలం కొంత శాతానికే పరిమితమైన ఓట్లను పెంచుకుంది. అధికార పార్టీకి మింగుడపడని విధంగా బలపడింది.

నాయకత్వ మార్పు
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే స్థానానికి పరిమితమైన బీజేపీ.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలను దక్కించుకుంది. అయితే ఆ తర్వాత పరిణామాల్లో కొంత మేరకు స్తబ్ధుగానే ఉంది. కానీ 2020లో కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత బలపడింది. ఇదే సమయంలో నాయకత్వ మార్పునకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారు. నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించిన ధర్మపురి అరవింద్‌కు కూడా పార్టీలో ఫాలోయింగ్​నేతగా తయారయ్యారు. వీరికి డీకే అరుణ, జితేందర్‌రెడ్డి వంటి నేతలు తోడయ్యారు. నాయకత్వ మార్పుతో కాషాయ దళానికి కొత్త ఊపు వచ్చినట్లైంది. ఇక ఇటు సంజయ్.. అటు అరవింద్ రాష్ట్ర రాజకీయాలు, అధికార టీఆర్‌ఎస్‌పై దూకుడు పెంచారు. వ్యతిరేక గళాన్ని ఎత్తుకున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన నినాదాన్ని వినిపించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు. చాలా మేరకు అడ్డంకులు కల్పించారు. అరెస్ట్‌లు, దాడులకు దిగినా.. అది కాషాయ దళానికి కలిసొచ్చింది. అయితే బండి సంజయ్‌కు పగ్గాలు అప్పగించడంతోనే బీజేపీ స్ట్రాటజీ మారిపోయిందని చెప్పుకోవాల్సిందే.

దుబ్బాకలో ఉత్కంఠభరిత గెలుపు
దుబ్బాక ఉప ఎన్నికలు బీజేపీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా తీర్చిదిద్దాయి. అప్పటికే కాంగ్రెస్​పార్టీ దాదాపుగా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ బరిలో నిలిచి గెలిచింది. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో ఇక్కడ ఉప‌‌ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన రఘునందన్‌రావు మళ్లీ పోటీకి దిగారు. టీఆర్‌ఎస్ నుంచి రామలింగారెడ్డి సతీమణి సుజాత, కాంగ్రెస్​ నుంచి చెరుకు శ్రీనివాస్​రెడ్డి పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ పోరాటపటిమ చూపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 15,131 ఓట్లతో 9.82 శాతంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఉప ఎన్నికల్లో మాత్రం 38.47 ఓట్లను దక్కించుకున్నారు. రౌండ్​రౌండ్‌కూ జరిగిన ఉత్కంఠ పోరులో వెయ్యికిపైగా ఓట్లతో గెలిచాడు. దీంతో బీజేపీ వేవ్ మొదలైంది. ఇక్కడ ప్రచార బాధ్యతలను భుజానేసుకున్న సంజయ్‌కు పార్టీ అధిష్ఠానం నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ విజయం
హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపింది. హిందుత్వం ఎజెండాగా సాగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి చుక్కలు చూపించింది. 2016లో గ్రేటర్​హైదరాబాద్​ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో గెలిచి 10.34 శాతం ఓట్లు సాధించిన కమలం పువ్వు.. ఈసారి మాత్రం నువ్వా.. నేనా? అన్నట్టుగా పోటీ ఇచ్చింది. అధికార పార్టీకి చెమటలు పట్టించింది. రాష్ట్రమంతా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. డివిజన్లలో మంత్రులంతా మకాం వేశారు. అయినా బీజేపీ గాలి వీచింది. ఈసారి 48 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 35.55 శాతం ఓట్లు రాబట్టుకుంది. అధికార టీఆర్‌ఎస్​పార్టీ 56 స్థానాల్లో గెలిచి 35.77 శాతం ఓట్లు రాబట్టుకుంటే.. బీజేపీ కూడా అదే స్థాయిలో పోటీ ఇచ్చింది. కేవలం 0.2 శాతం ఓట్లను మాత్రమే టీఆర్‌ఎస్ కంటే తగ్గాయి. దీంతో బీజేపీ ఒక్కసారిగా రాష్ట్రంలో రెండో స్థానంలోకి వచ్చింది.

వలసలకు క్యూ కట్టిన నేతలు
మరోవైపు టీఆర్‌ఎస్, కాంగ్రెస్​నేతలు బీజేపీ వైపు వెళ్లారు. మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు పలువురు జిల్లాల నేతలు కాషాయం కండువా కప్పుకున్నారు. అటు కాంగ్రెస్ కూడా దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితే. దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి నేతలు క్యూ కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయా ప్రాంతాల నుంచి నేతలు బీజేపీలో చేరారు. ఇంకా పార్టీలోకి వచ్చేవారు ఎక్కువగానే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరు మాజీ మంత్రులు, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కాషాయదళంలో చేరే అవకాశాలున్నాయి.

అధికార పార్టీకి చుక్కెదురు
2018 తర్వాత ఎదురులేని పార్టీగా నిలిచిన గులాబీ ఒక్కసారిగా వెలవెలబోయింది. రెండు ఎన్నికల సందర్భంలో కనీసం తెలంగాణ భవన్​ దగ్గర సందడి లేకుండా పోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్, కొంతమంది మంత్రులు జనాలకు దూరమయ్యారనే వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే పలు సామాజిక వర్గాలు కూడా టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నాయి. అయితే రాష్ట్రంలో తమకు ఎదురులేదని, కాంగ్రెస్‌ను పూర్తిగా చంపేశామనే ధోరణిలో ఉన్న టీఆర్‌ఎస్‌కు అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. కనీసం ఎక్కడా పోటీ అని కూడా భావించని బీజేపీ ఒక్కసారిగా నిలదొక్కుకోవడంతో ఆందోళనకు గురైంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోకముందే.. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టింది. గ్రేటర్‌లో గతంలో 99 స్థానాల్లో గెలిచి, కాంగ్రెస్ నుంచి ఒక్కరిని తీసుకుని 100 స్థానాల్లో ఉన్న గులాబీ.. ఈ ఎన్నికల్లో మాత్రం 56 స్థానాల్లోనే నానా అగచాట్లు పడి గెలిచింది. దీంతో పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికలు కూడా వ్యతిరేకతను మూటగట్టుకుంటాయనే అనుకుంటున్నారు.

కష్టకాలంలో కాంగ్రెస్​
ఇక కాంగ్రెస్​ మరింత కష్టకాలంలో పడింది. పార్టీకి వరుస దెబ్బలు ఘోరంగా తగిలాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారిలో 12 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో ఉండగా.. రాష్ట్ర నాయకత్వ లోపం మళ్లీ మళ్లీ స్పష్టమైంది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసింది. అసలు టికెట్​కేటాయింపులోనే తప్పు చేశారని భావించారు. ఇక గ్రేటర్​హైదరాబాద్ ఎన్నికల్లో మళ్లీ యథాతథమే. 2016లో కనీసం 10.40 శాతం ఓట్లు సాధించుకున్న హస్తం నేతలు.. ఈసారి మాత్రం కేవలం 6.64 శాతానికి పడిపోయారు. కేవలం రెండు స్థానాల్లో గెలిచారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ పార్టీకి మరోసారి రాజీనామా చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ మార్పు అనివార్యమైంది. అంతకు ముందే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా తమిళనాడుకు చెందిన ఎంపీ మాణిక్కం ఠాగూర్​నియమితులయ్యారు. దుబ్బాక ఉప‌ఎన్నికల ముందే ఆయన రాష్ట్రానికి వచ్చినా.. పెద్దగా ఆశించిన ఫలితాలేమీ రాలేదు. దుబ్బాక, హైదరాబాద్​ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. టీపీసీసీ చీఫ్​ఎంపికపై అభిప్రాయాలు సేకరించారు. ఇదే సమయంలో పార్టీలోని సీనియర్లు తిరుగుబాట మొదలుపెట్టారు. ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో అధిష్ఠానంపై కూడా ఆరోపణలకు దిగుతున్నారు.

పోటీలో లేని టీజేఎస్​
ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహా‌కూటమిగా పొత్తుతో ముందుకు వచ్చిన పార్టీలో ఈ ఏడాది మొత్తం చెల్లాచెదురయ్యాయి. ఎన్నికల సందర్భంగా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. టీజేఎస్​అధినేత కోదండరాం ఎన్నికల ప్రక్రియకే దూరంగా ఉన్నారు. పార్టీ తరపున అభ్యర్థులను పెట్టినా.. ఎక్కడా ప్రచారం కూడా చేసుకోలేదు. మరోవైపు వామపక్షాలు కూడా అంతే. పార్టీ ఉనికి అనేదే కరువైంది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వంపై కనీస నిరసనలకు కూడా ఏ పార్టీ సాహసించలేదు. కేవలం బీజేపీ మాత్రమే కొన్ని అంశాల్లో వ్యతిరేకిస్తూ నిరసనకు దిగింది. పలు అంశాలపై మేమే అన్నట్టుగా ఉండే వామపక్షాలు ఈ ఏడాది ఉనికిలో లేనట్లే ఉన్నాయి.