డెంగ్యూ, కొవిడ్-19 రెండూ ఉన్న మహిళను కాపాడిన అమోర్ ఆస్పత్రి వైద్యులు
Deccan News Health
హైదరాబాద్, సెప్టెంబర్ 19, 2022: డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్‌లెట్లు ఏకంగా 7వేలకు పడిపోయి, అదే సమయంలో కొవిడ్-19 వైరస్ కూడా ఉన్న 35 ఏళ్ల మహిళకు నగరంలోని అమోర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి కాపాడారు. సమయానికి వెంటనే తగిన వైద్యం అందించడంతో రెండు వ్యాధుల నుంచి ఆమెకు రక్షణ కల్పించగలిగారు. ఈ క్రమంలో ఎన్నో వైద్యపరమైన సవాళ్లు ఎదురయ్యాయి.
ఆమెకు చికిత్స అందించిన అమోర్ ఆస్పత్రి కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఆరతి బెల్లారి ఈ వివరాలను తెలిపారు. “తొలిసారి ఆమె మావద్దకు వచ్చినప్పుడు బీపీ బాగా తక్కువగా ఉంది, ప్లేట్‌లెట్లు 7వేల స్థాయికి పడిపోయాయి. అప్పటికే ఆమె డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌తో ఉన్నారు. ముందుగా ఆమె స్థానిక వైద్యుల వద్దకు వెళ్లి ఐవీ యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు. ఆమెకు ఊపిరి కూడా అందట్లేదు. కో-ఇన్ఫెక్షన్లు బయట తీవ్రంగా ఉండటంతో అనుమానం వచ్చి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా.. ఆమెకు కొవిడ్-19 ఉన్నట్లు తేలింది.
దురదృష్టవశాత్తు చాలామంది ఏదైనా అనారోగ్యానికి ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం అనేది చిట్టచివరి పరిష్కారమని భావిస్తారు. ఈమె కూడా అలాగే అనుకున్నారు. ఆమెకు జ్వరం తగ్గకపోతుండటంతో ముందుగా ఆర్ఎంపీల వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. వాళ్లు అసలు సమస్య ఏంటో గుర్తించలేక, పలురకాల యాంటీబయాటిక్‌లు, ఐవీ ఇంజెక్షన్లు ఇచ్చేశారు. చివరకు ఆమె మావద్దకు వచ్చినప్పుడు ఆమెకు డెంగ్యూ పాజిటివ్ అని తెలిసింది, బీపీ కూడా బాగా తగ్గిపోతోంది. అలాంటి స్థితిలోనే ఆమె ఆస్పత్రికి వచ్చారు. అప్పటికి బీపీ కేవలం 70/60 మాత్రమే ఉంది.”
అమోర్ ఆస్పత్రిలో వెంటనే ఆమెకు పలురకాల వైద్యపరీక్షలు చేశారు. నివేదికలు చూస్తే ఆమె ప్లేట్‌లెట్ కౌంట్ కేవలం 7000 ఉన్నట్లు తెలిసింది. అది బాగా తక్కువ కావడమే కాదు, దానివల్ల రక్తస్రావం కూడా అవుతుంది.
“వెంటనే కోలుకునేందుకు వీలుగా ముందు ఆమెకు ప్లేట్‌లెట్లు ఎక్కించాం. అదృష్టవశాత్తు రక్తస్రావం లేకపోవడంతో ఆమె బీపీ క్రమంగా పెరగడం మొదలైంది. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమెకు ఊపిరి అందడం కష్టమైంది. ఆక్సిజన్ స్థాయి కూడా క్రమంగా పడిపోతుండటంతో మేం రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల ఆక్సిజన్ పెట్టాం. డెంగ్యూ ఎక్కువరోజులు ఉంటే ఊపిరితిత్తులు, గుండె, ఉదరంలో నీరు చేరే ప్రమాదం ఉంటుంది” అని ఆమె వివరించారు.
సీటీ స్కాన్ చేస్తే.. డెంగ్యూ వల్ల నీరు చేరడంతో పాటు కొవిడ్ వల్ల న్యుమోనియా పరమైన మార్పులు కూడా కనిపించాయి. అందుకే ఆమెకు ఊపిరి అందకపోవడం, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ పెట్టాం. ఆమె డీ-డైమర్ కూడా ఏకంగా 10వేలు దాటిపోయింది. ఇది కొవిడ్, డెంగ్యూ రెండు ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది.
“ఇది ఏమాత్రం ఊహించలేని ప్రమాదకర పరిస్థితి. డెంగ్యూ వల్ల ప్లేట్‌లెట్లు తగ్గిపోతే అంతర్గత రక్తస్రావం అవుతుంది. కొవిడ్ వల్ల రక్తం గడ్డ కట్టచ్చు. రక్తం గడ్డకట్టకుండా ఉండే మందులు తగినంత డోసులోనే ఇవ్వడం ద్వారా రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. దాదాపు నాలుగు రోజుల తర్వాత ఆక్సిజన్ స్థాయి, ప్లేట్‌లెట్లు రెండూ సాధారణ స్థితికి వచ్చాయి. ఏడోరోజు పూర్తిగా ఆక్సిజన్ ఇవ్వడం ఆపేసి, తర్వాతి రోజు ఆమెను డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ బెల్లారి వివరించారు.
రోగికి సరికొత్త జీవితం ప్రసాదించినందుకు అమోర్ ఆస్పత్రి వైద్యులకు రోగి, ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
వర్షాకాలంలో పలురకాల వైరల్ జ్వరాలు వస్తున్నాయి. వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్‌లు వాడక్కర్లేదు. కేవలం పారాసిటమాల్, అవసరమైతే ఫ్లూయిడ్లు పెడితే చాలు. కానీ చాలామంది యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇది ఆపాలి. 3-5 రోజుల పాటు జ్వరం చాలా ఎక్కువగా ఉంటే, వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి వాళ్లు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి. సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండండి.