ప్రపంచ అవయవదాన దినోత్సవ వేళ ‘ప్రెసిడెన్షియల్‌ వాయిసెస్‌ ’ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన ఏఐజీ హాస్పిటల్స్‌

గత 70 సంవత్సరాలలో వైద్య రంగంలో అత్యంత అద్భుతమైన మరియు నాటకీయ చికిత్సా పురోగతిలలో ఒకటిగా అవయవదానం పరిగణించబడుతుంది. క్లీనికల్‌ ప్రయోగాల దశ నుంచి వృద్ధి చెంది, నిరూపిత క్లీనికల్‌ ప్రభావాలతో అతి సాధారణమైన మరియు ఆధారపడతగిన ప్రక్రియగా ఇప్పుడు మారింది. అవయవ మార్పిడి నిర్వహణ వ్యూహాలతో పోల్చినప్పుడు అంటే దీర్ఘకాలిక మరియు తీవ్రమైన తుది దశ అవయవ విఫల కేసులతో పోల్చిప్పుడు అవయవదానం అనేది ప్రాణాలను కాపాడే మరియు అతి తక్కువ ఖర్చు కలిగిన విధానంగా పరిగణించబడుతుంది.
గత కొద్ది సంవత్సరాలుగా, అవయవ మార్పిడి కార్యక్రమాలు విజయవంతం కావడంతో పాటుగా సాంస్కృతిక పరంగా కూడా అంగీకరిస్తుండడం, చట్టం, రాజకీయ మద్దతు కారణంగా అవయవాల సేకరణ మరియు కేటాయింపు ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అవయవ మార్పిడి చరిత్రను పరిశీలిస్తే, అనుకోని రీతిలో కనుగొనడం, విషాద ప్రమాదాలు, నెరవేరని వాగ్ధానాలు, వదిలివేయబడిన మార్గాలు మరియు చట్టపరమైన లేదా నైతిక పరంగా చిక్కులను సృష్టించిన సంఘటనలు, అన్నీ కలిసి ఈ రంగాన్ని శక్తివంతమైన అభివృద్ధి పథంలో పనిగా మార్చింది.
భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 3.5 లక్షల మంది ప్రజలకు ఏదో ఒక అవయవ మార్పిడి అవసరం పడుతుంది. అయితే 11వేల కన్నా తక్కువగా అవవాలను మార్పిడి చేస్తున్నారు.
మరణానంతరం తమ అవయవాలను దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేసేలా ప్రజలకు స్ఫూర్తి కలిగించడం మరియు అవయవదాన ఆవశ్యకతను గుర్తించడమే లక్ష్యంగా ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏఐజీ హాస్పిటల్స్‌, మొట్టమొదటిసారి అనతగ్గ కార్యక్రమం ‘ప్రెసిడెన్షియల్‌ వాయిసెస్‌’ ను నిర్వహించింది. భారతదేశపు అత్యున్నత వైద్య సమాజాలకు చెందిన అధ్యక్షులు దీనిలో పాల్గొన్నారు. అవయవదాన ఆవశ్యకత గురించి తెలుపుతూనే అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
‘‘భారతదేశంలో అవయవదానం వేగవంతంగా పెరగడంతో పాటుగా అవయవాలు కావాల్సిన రోగులు మరియు లభించే అవయవాల నడుమ ఖాళీ గణనీయంగా తగ్గాల్సిన ఆవశ్యకత ఉంది. అతి క్లిష్టమైన వ్యాధుల సంఖ్య పెరుగుతుండటం చేత, చనిపోయిన శరీరాల నుంచి అవయవాలను తీసుకుని వాటిని అత్యవసరమైన వారికి అందజేయడం ప్రాధాన్యత కావాల్సిన అవసరమూ ఉంది’’ అని డాక్టర్‌ డీ నాగేశ్వర్‌రెడ్డి, ఛైర్మన్‌, ఏఐజీ హాస్పిటల్స్‌ అన్నారు.
డాక్టర్‌ రెడ్డి మరింతగా వెల్లడిస్తూ ‘‘ ఇటీవలి కాలంలో, భారత ప్రభుత్వ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నేతృత్వంలోని జాతీయ అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థ(నోట్టో ), ఆరోగ్య సంరక్షణ రంగంలోని ఇతర వాటాదారులతో కలిసి అవగాహన మెరుగుపరిచేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. దేశంలో అవయవాల సేకరణ, కేటాయింపు, అవయవాల పంపిణీ కార్యక్రమాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ నోట్టో’’ అని అన్నారు.
ఆరు వైద్య సంఘాలకు చెందిన అధ్యక్షులు ఈ సమావేశంలో మాట్లాడారు. ఆ సంఘాలలో 1. కార్డియాలజీ సోసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ). 2. ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ (ఐసీఎస్‌), 3. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఐఎస్‌జీ). 4. అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ). 5. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ (ఐఎస్‌ఎన్‌) మరియు 6. ఇంటర్నేషనల్‌ హెపటో–పాన్‌క్రియాటో –బైలరీ అసోసియేషన్‌ (ఇండియన్‌ చాఫ్టర్‌) (ఐహెచ్‌పీబీఏ) ఉన్నాయి.
మొత్తంమ్మీద అవయవమార్పిడి అంశం గురించి డాక్టర్‌ అభయ్‌ దాల్వీ, అధ్యక్షులు, ఏఎస్‌ఐ మాట్లాడుతూ ‘‘గత నాలుగు దశాబ్దాలుగా, జీవించి ఉన్న దాతలు మార్పిడి కోసం అంగీకరించడం పరంగా మనం చెప్పుకోతగ్గ సామర్థ్యం సంతరించుకోగలిగాము కానీ మరణించిన వ్యక్తుల అవయవాలను దానం చేయడం అనేది ఇప్పటికీ ప్రజాఆరోగ్య ప్రయోజనాల కోణంలో చూసినప్పుడు చాలా దూరంలోనే ఉంది. మరణించిన వ్యక్తుల అవయవాలను కూడా దానం చేయగలిగినప్పుడు, భారతదేశపు అవయవ మార్పిడి అవసరాలు గణనీయంగా తీరేందుకు అవకాశాలున్నాయని మేము ఆశిస్తున్నాం. అయితే దీనికి విస్తృత శ్రేణి విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అవసరమైన వైద్య మౌలిక సదుపాయాలనూ అభివృద్ధి చేయడం ద్వారా మరణించిన వ్యక్తుల అవయవ మార్పిడికి అవసరమైన రవాణా సౌకర్యాలకూ మద్దతునందించడం వీలవుతుంది’’ అని అన్నారు.
గుండె మార్పిడి మరియు అవయవ లభ్యత కోణంలో డాక్టర్‌ పీపీ మోహనన్‌, అధ్యక్షులు, సీఎస్‌ఐ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో ప్రతి సంవత్సరం 50వేల మంది రోగులకు గుండె మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. అయితే కేవలం 250 మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ సవాళ్లు అధికంగానే ఉన్నాయి కానీ కాలం గడిచే కొద్దీ ఈ అంశాలు సహకార ప్రయత్నాలతో మెరుగుపడుతున్నాయి. సమయానికి అవయవాల లభ్యతకు సంబంధించిన సమాచారం అందించడం, ఎలాంటి అసౌకర్యమూ లేకుండా రవాణాకుభరోసా కల్పించడం వంటివి గుండె మార్పిడి వాతావరణం మారేందుకు మరింతగా తోడ్పడనున్నాయి’’ అని అన్నారు.
ఊపిరితిత్తుల మార్పిడి పరిస్థితి గురించి డాక్టర్‌ డి బెహరా, అధ్యక్షులు, ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ మాట్లాడుతూ ‘‘కొన్ని రకాల వృద్ధి చెందుతున్న తుది దశ ఊపిరి తిత్తుల వ్యాధులకు ఖచ్చితమైన చికిత్సగా ఊపిరితిత్తుల మార్పిడి నిలుస్తుంటుంది. అయితే, మొత్తంమ్మీద భారతదేశంలో అవయవదాన శాతం తక్కువగా అంటే, 10 లక్షల మంది జనాభాకు కేవలం 0.52 మాత్రమే జరుగుతున్నాయి. అదే యుఎస్‌లో 10 లక్షల మంది జనాభాకు 36.07 దాతలు ఉంటున్నారు. సామాన్య ప్రజలతో పాటుగా డాక్టర్లకు సైతం అవయవ మార్పిడి ప్రయోజనాలను తెలుపడం ద్వారా ఈ సంఖ్యలను పెంచవచ్చు.
ఖర్చు కూడా ఈ అవయవ మార్పిడికి ఓ విఘాతంలా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తుల మార్పిడి పరంగా ! ఈ తరహా ఖర్చులను కూడా కవర్‌ చేసేలా భీమా పథకాల అవసరం మనకు ఉంది’’అని అన్నారు.
కిడ్నీ మార్పిడి పట్ల సమస్యలను గురించి డాక్టర్‌ ఏకె భల్లా, అధ్యక్షులు, ఐఎస్‌ఎన్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో అవయవదానం పట్ల అవగాహన లేమికి తోడు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడమనేది భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 2.5 లక్షల మంది ప్రజలు తుది దశ మూత్ర పిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. వీరిలో చాలామంది డయాలిసిస్‌ కోసం అధికమొత్తంలో చెల్లించే స్థోమత లేకుండా ఉంటున్నారు. ఇలాంటి వారికి మూత్రపిండాల మార్పిడి మాత్రమే అందుబాటులో ఉన్న అవకాశం. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ లెక్కల ప్రకారం, 21, 395 మూత్రపిండాలు భారతదేశంలో 1971 మరియు 2015 నడుమ మార్చడం జరిగింది. వీటిలో కేవలం 783 మాత్రమే చనిపోయిన వ్యక్తుల నుంచి సేకరించడం జరిగింది. ఈ ఖాళీని పూరించడానికి అవయవదానాన్ని మరింత చురుగ్గా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
మనదేశంలో ఈ తరహాలోనే అత్యధికంగా అవసరం పడుతున్న అవయవాలలో కాలేయం కూడా నిలుస్తుంది. దీని గురించి డాక్టర్‌ రాకేష్‌ కొచ్చార్‌, అధ్యక్షులు. ఐఎస్‌జీ మాట్లాడుతూ ‘‘లివర్‌ సిరోసిస్‌ మరియు ఇతర దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు భారతదేశంలో వేగంగా పెరుగుతున్నాయి. కాలేయ మార్పిడి జరుగకుండా ఈ తరహా కేసులలో 2–3 సంవత్సరాల కన్నా అధికంగా జీవించడమంటూ జరుగదు. దురదృష్టవశాత్తు, 50వేల మందికి పైగా ప్రజలకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స అవసరం పడితే కేవలం 2వేల శస్త్రచికిత్సలు మాత్రమే జరుగుతున్నాయి. ప్రస్తుతం, మన దేశంలో అధిక శాతం కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను జీవించి ఉన్న వ్యక్తుల నుంచి కాలేయం సేకరించి చేస్తున్నారు. అయితే బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి కాలేయం సేకరిస్తే అది మరింత అందుబాటులో ఉంటుంది కావున దానిని ప్రోత్సహించాల్సిన అవసరమూ ఉంది’’ అని అన్నారు.
భారతదేశంలో పాన్‌క్రియాటిస్‌ మార్పిడి ఇంకా ఆరంభ దశలోనే ఉంది . అతి కొద్ది శస్త్ర చికిత్సలను మాత్రమే దీనిలో చేశారు. దీని గురించి డాక్టర్‌ శైలేష్‌ షిర్కాండే. అధ్యక్షులు. ఐహెచ్‌సీబీఏ మాట్లాడుతూ ‘‘భారతదేశాన్ని ప్రపంచపు మధుమేహ రాజధానిగా చెబుతుంటారు. 2030 నాటికి, మన దేశంలో దాదాపు 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడతారని అంచనా. వీరిలో చాలామందికి శరీరంలో పూర్తిగా ఇన్సులిన్‌ లోపిస్తుంది. దీనికి వారి పాన్‌క్రియాస్‌ ఏ మాత్రమూ ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయలేకపోవడం కారణం. అలాంటి వారికి పాన్‌ క్రియాస్‌ మార్పిడి ఓ వరం. భారతదేశంలో పాన్‌క్రియాటిక్‌ మార్పిడి నూతనదశలోనే ఉంది. అతి కొద్ది కేంద్రాలకు మాత్రమే అది పరిమితమై ఉంది. తగిన నైపుణ్యం లేకపోవడంతో పాటుగాఅవయవాల లభ్యత లేకపోవడమూ దీనికి కారణం’’అని అన్నారు.
ఈ కార్యక్రమం గురించి డాక్టర్‌ జీవీ రావు, డైరెక్టర్‌, ఏఐజీ హాస్పిటల్స్‌ మరియు పూర్వ అధ్యక్షులు– ఐహెచ్‌పీబీఏ మాట్లాడుతూ ‘‘అవయవదానం గురించి ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాల్సిన సమయమిది. ప్రతి దాత, 8 మంది జీవితాలను కాపాడే సామర్ధ్యం కలిగి ఉంటాడు. అన్ని రకాల అవయవమార్పిడి కార్యక్రమాలను నిర్వహించడానికి తగిన నైపుణ్యం మనం సంపాదించుకున్నాము కానీ అవయవదానంతో మిళితమై ఉన్న అపోహలను పౌర సమాజం పొగొట్టుకోవడానికి తగిన అవగాహన అవసరం’’ అని అన్నారు. డాక్టర్‌ రావు మరింతగా మాట్లాడుతూ మధుమేహ రోగుల చికిత్స కోసం ఎంపిక చేసిన రోగులకు ఐస్లెట్‌ సెల్‌ మార్పిడి వంటి కొత్తపద్ధతులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
ఈ ప్రపంచ అవయవదాన దినోత్సవాన, అవయవదానం పట్ల అవగాహన మెరుగుపరుచుకోవడానికి మనమంతా కట్టుబడి ఉందాం. తద్వారా వేలాది మంది రోగులకు నూతన జీవితమూ పొందగలరు.