ఆయుష్మాన్ భారత్ – కార్పొరేట్ల దోపిడీ
కేంద్ర బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య రంగానికి రూ.61,398 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.6,400 కోట్లు ‘ఆయుష్మాన్ భారత్’కు కేటాయించారు. గతేడాది ఈ పథకానికి రూ.1800 కోట్లు కేటాయించిన దానితో పోల్చితే మూడున్నర రెట్లు. గతేడాదికన్నా మొత్తం వైద్య, ఆరోగ్య బడ్జెట్ కూడా దాదాపు రూ.8,500 కోట్లు పెరిగింది. ఇదంతా చూపించి ఎన్నడూ లేనంత గొప్పగా మోడీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల అమిత శ్రద్ధ చూపిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.
వైద్య, ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రపంచంలోని 196 దేశాలలో భారతదేశం 154వ స్థానంలో వుంది. ప్రపంచం మొత్తం మీద ప్రసూతి మరణాలలో 20 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి. శిశు మరణాలైతే 25 శాతం మన దగ్గరే. అయిదేళ్ల లోపు పిల్లలు ప్రతి వెయ్యి మందిలో ఇక్కడ 69 మంది చనిపోతున్నారు. అంటువ్యాధులతో మరణించే వారు దేశంలోని మొత్తం మరణాలలో 53 శాతం. అంటే వైద్య, ఆరోగ్య సంరక్షణ చాలా దయనీయంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇంకోవైపు ఆరోగ్యం కోసం ఎవరికి వారు వ్యక్తులుగా స్వంతంగా భరిస్తున్నది మన దేశంలో 67 శాతం! మరి ప్రభుత్వ బాధ్యత ఏంటి? అమెరికన్ ఫెడరల్ బడ్జెట్ మొత్తం 4.4 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో వైద్య, ఆరోగ్య రంగానికి కేటాయించినది రూ.1.04 లక్షల కోట్లు. అంటే బడ్జెట్‌లో 23.5 శాతం! తలసరి బడ్జెట్ కేటాయింపు 3,150 డాలర్లు! ఇదే మన దేశంలోనైతే కేంద్రం, రాష్ట్రం కలిపి తలసరి కేటాయింపు రూ.458 మాత్రమే. ‘జిడిపి పెరిగి పోతే చాలు. దేశం, ప్రజలు అభివృద్ధి చెందిపోతారు’ అనే వాదనను పాలక వర్గాలు పదే పదే వల్లిస్తుంటాయి. కాని వాస్తవం అందుకు రివర్స్‌లో ఉంటుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే వారి ఉత్పాదక శక్తి పెరిగి దేశం జిడిపి తప్పనిసరిగా పెరుగుతుంది. మన పాలకులకు లోపించింది ఈ ఇంగిత జ్ఞానమే. అందుకే రక్షణ రంగానికన్నా ప్రజల ఆరోగ్య సంరక్షణా రంగానికి పెద్ద పీట వేయడం అవసరం!
ఇక మోడీ ప్రభుత్వపు కేటాయింపుల గొప్పలు కూడా పరిశీలిద్దాం
గతేడాది జిడిపిలో 2.2 శాతం కేటాయిస్తే, ఈ ఏడూ 2.2 శాతమే! మరి పెంచిందేంటి? గొప్పగా చెప్పుకున్న ‘ఆయుష్మాన్ భారత్’కూ కేటాయించింది ఈ 2.2 శాతంలోనే తప్ప అదనం ఏమీ కాదు. అంటే వేరే ఇతర ఆరోగ్య పథకాలవి కోత పెట్టారన్నమాట.
దేశం మొత్తం మీద సబ్ సెంటర్లలో 19 శాతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 25 శాతం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 22 శాతం మూతబడినట్లు ప్రభుత్వమే పార్లమెంటుకు తెలిపింది. వాస్తవ చిత్రం ఇది కాగా మునుపటి ప్రభుత్వ కాలంలో ప్రవేశ పెట్టిన ఆరోగ్య పథకానికే ‘ఆయుష్మాన్ భారత్’ అని పేరు మార్చి మోడీ ప్రచారం చేసుకుంటున్న వైనాన్ని చూద్దాం.
దేశం మొత్తం మీద 1,50,000 వైద్య ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ‘ఆయుష్మాన్ భారత్’ కింద నెలకొల్పుతారు. గతేడాది కేటాయించిన మొత్తం రూ.1800 కోట్లు. అంటే ఒక్కో కేంద్రానికీ లక్షా ఇరవై వేలు! ఒక్కో కేంద్రం పరిధిలోనూ వేల సంఖ్యలో ప్రజలు ఉంటారు. ఈ మొత్తం ఏ మూలకు సరిపోతుంది? సిబ్బంది జీతాలకు సైతం చాలదు. ఈ సంగతి ప్రభుత్వానికీ తెలుసు. ప్రభుత్వం అసలు ఉద్దేశం వేరు. ఈ దేశంలోని వైద్య, ఆరోగ్య రంగాన్ని మొత్తంగా ప్రైవేటుపరం, విదేశీ బహుళజాతి గుత్త సంస్థల పరం చేయాలన్నదే ప్రభుత్వం కుట్ర.
ఇప్పటికే ఈ కుట్ర అమలు ప్రారంభమైంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటీకరించడం ప్రారంభించారు. యు.పిలో ‘ఆయుష్మాన్ భారత్’ కేంద్రాలను పిపిపి నమూనాలో ఏర్పాటు చేయనున్నట్లు యోగి ప్రభుత్వం ప్రకటించింది. మన రాష్ట్రంలో కూడా కొన్ని జనరల్ హాస్పిటళ్లను, కొన్ని పిహెచ్‌సిలను పిపిపి మోడల్ కిందకు తెస్తున్నట్లు గతంలో ప్రకటించారు. పలు డయాగ్నోస్టిక్ సేవలను ఇప్పటికీ ప్రైవేటీకరించారు. బడ్జెట్లలో కేటాయింపులు పెంచకుండా, నిధుల కొరతను సాకుగా చూపించి వైద్య సేవలను ప్రైవేటీకరించడమే ప్రభుత్వ విధానం.
వైద్య విద్యనూ వదలలేదు
వైద్య రంగంలో ఎన్నికల ద్వారా ఏర్పడే ‘మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ స్థానంలో కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసే జాతీయ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటును మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. వైద్య విద్యా సంస్థల ఏర్పాటు అనుమతులు, నిర్వహణ, గుర్తింపు వగైరా దీని పరిధిలోకి వస్తాయి. మేనేజ్‌మెంటు కోటా కింద 60 శాతం వరకూ అనుమతి ఇస్తున్నారు. దీని వలన ఇతర కేటగిరీ సీట్లన్నీ కలిపి 40 శాతానికే పరిమితం అవుతాయి. దళిత, గిరిజన అభ్యర్థులకు మరీ ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. ఇంకోపక్క ఎటువంటి స్క్రీనింగూ అవసరం లేకుండానే విదేశీ డాక్టర్లు భారతదేశంలో ప్రాక్టీసు చేసుకోవడానికి వీలుగా నిబంధనలన్నింటినీ సడలించారు. ఈనాడు దేశంలో కనీసం అయిదు లక్షల మంది డాక్టర్లు అదనంగా అవసరం. ఈ అవసరాన్ని ప్రైవేటు, విదేశీ వైద్య విద్యా సంస్థలు అడ్డం పెట్టుకుని ఎలా పట్టు సంపాయించ చూస్తున్నాయో, వారికి మోడీ ప్రభుత్వం ఎంత దన్నుగా నిలుస్తోందో చూడండి!
రాష్ట్రాల పాత్ర కుదింపు
రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం ఆస్పత్రి సేవలను ప్రజలకందించే బాధ్యత రాష్ట్రాలది. కాని ‘ఆయుష్మాన్ భారత్’ను కేంద్ర ప్రాయోజిత పథకంగా తీసుకొచ్చారు. ఈ స్కీములో 40 శాతం ఖర్చు రాష్ట్రాలు భరించాలి. అయితే 7.5 కోట్ల మంది ప్రజలకు మోడీ ఫొటోలు మాత్రమే ఉన్న వ్యక్తిగత లేఖలను పంపుతున్నారు. ఇదంతా కేంద్రమే నిర్వహిస్తున్నట్లు చిత్రీకరిస్తున్నారు. నిజానికి ఈ స్కీము వర్తించని వారు ఇంకో 7.5 కోట్ల మందైనా ఉంటారు. వారందరినీ చూసుకోవాల్సిందీ, అందరికీ వైద్య సేవలందించవలసిందీ రాష్ట్రాలే. అటువంటి రాష్ట్రాల సహకారం తీసుకునే బదులు మోడీ ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల పైన, కార్పొరేట్ ఆస్పత్రులపైన ఆధారపడుతోంది. 95 శాతం ప్రజలకు వైద్య సేవలందించగల ప్రభుత్వ వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసి స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు పెద్ద పీట వేస్తోంది. దీని వలన వైద్య సేవలు మెరుగుపడవు సరికదా వారందించే వైద్యం ఖరీదు మాత్రం పెరిగిపోతుంది.
ఆరోగ్యం జీవించే హక్కులో అంతర్భాగం. ఈ హక్కును గ్యారంటీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాని ప్రభుత్వం ఆ బాధ్యత నుండి తప్పుకుని ఆరోగ్య వైద్య రంగాన్ని వ్యాపారంగా మారుస్తోంది. ఇది నయా ఉదారవాద కుట్ర.