ఆరేళ్ల తెలంగాణ.. మంచి… చెడూ
జూన్ 2.. తెలంగాణ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు ఇది. 60 ఏళ్ల తరబడి పోరాటాలు.. ఎన్నో ఉద్యమాలు.. ఎందరో అమర వీరుల ప్రాణత్యాగాల ఫలంగా ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఇది. ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా శక్తి వంచన లేకుండా పోరాడిన తెలంగాణ ప్రజలు.. సొంత రాష్ట్ర కలను నెరవేర్చుకున్నారు. 1969 నుంచే తెలంగాణ కోసం ఉద్యమాలు ప్రారంభం కాగా.. టీఆర్ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక దొరికినట్లయ్యింది. 2009లో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. 2011లో చేపట్టిన సకల జనుల సమ్మెతో ఢిల్లీ పాలకుల్లో ఆలోచన మొదలైంది. చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా 2013 జూలైలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమంటూ జనం కొట్లాడి మరీ సాధించుకున్న తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి ఆరేళ్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏ మార్పులొచ్చాయో చూద్దాం.
కరెంటు వెలుగుల్లో తెలంగాణ
జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగా.. తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఆరేళ్లలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది. తెలంగాణ వస్తే చీకట్లు తప్పవని నాటి పాలకుల చేసిన హెచ్చరికలు తప్పని నిరూపిస్తూ.. విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడమే కాదు.. సోలార్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని సైతం గణనీయంగా పెంచుకుంది. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినా సరే.. డిమాండ్‌కు సరిపడా సరఫరా చేస్తోంది. కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను నిర్మించడంతోపాటు.. భూపాలపల్లిలో మధ్యలో ఆగిపోయిన 600 మెగావాట్ల కేటీపీపీని ఏడాదిలోపే పూర్తి చేసింది. విద్యుల్లతల తెలంగాణగా రాష్ట్రం అవతరించింది.
గ్రామ గ్రామానా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ
గతంలో తెలంగాణ ప్రాంతం కరువు కాటకాలతో తీవ్రంగా సతమతం అయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ సర్కారు మిషన్ కాకతీయ పేరిట చెరువులను పునరుద్ధరణకు నడుం బిగించింది. వేలాది చెరువులకు పునరుజ్జీవం పోసింది. దీంతో చెరువులు నీటితో కళకళలడాతున్నాయి. ఇక తెలంగాణలో మరో ప్రధాన సమస్య ఫ్లోరైడ్. నల్గొండలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను చూస్తే మనసు విలవిల్లాడుతుంది. ఇలాంటి కష్టం పగోడికి కూడా రావద్దనిపిస్తుంది. దీనికి ప్రాధాన కారణం తాగునీరు. దీంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసి మంచి నీరు అందిస్తున్నారు. గోదావరి తలాపునే పారుతున్నా.. ఇన్నాళ్లూ బోరు నీళ్లు మాత్రమే తాగిన పల్లెవాసులు ఇప్పుడు గోదావరి నీళ్లను రుచి చూస్తున్నారు.
పెద్డ ఆలోచన రైతు బంధు
ఇక తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మీ పథకం, రైతు బంధు లాంటి పథకాలైతే ఓ సంచలనం. మిగతా రాష్ట్రాలు సైతం వీటిని అమలు పర్చడానికి ఆసక్తి చూపాయి. పేదింటి ఆడ పిల్లలకు పెళ్లికి డబ్బులు ఇవ్వడం కోసం రూపొందించిన కళ్యాణ లక్ష్మీ/ షాదీ ముబారక్ పథకం అందరి ప్రశంసలు పొందింది. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేలు చొప్పున ప్రతి ఏటా రెండు విడతల్లో పది వేల రూపాయల చొప్పున నేరుగా రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తోంది. కేంద్రం సైతం ఈ పథకం స్ఫూర్తితో కిసాన్ యోజనను ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లను మంజూరు చేసింది.
పురిటి నొప్పులు వినిపించని దవఖానాలు
తెలంగాణ ఏర్పాటయ్యాక తెలంగాణలో సర్కారీ దావఖానాల రూపు రేఖలు మారిపోయాయి. ఒకప్పుడు అప్పు చేసైనా ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్లే రోగులు… ఇప్పుడు ప్రభుత్వ వైద్యం వైపు చూస్తున్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులను సమకూర్చి.. నాణ్యమైన వైద్యం అందేలా చూస్తున్నారు. ఇక గర్భిణులు ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవం చేయించుకుంటే.. కేసీఆర్ కిట్ పేరిట రూ.2150తో ఓ కిట్ అందజేస్తున్నారు. ఆడ పిల్ల పుడితే రూ. 13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12 వేలు అందజేస్తున్నారు. దీంతో అనవసరపు సిజేరియన్లు తగ్గడమే కాదు.. శిశుమరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కానీ హైదరాబాద్‌లో భారీ పెద్దాసుపత్రుల నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది.
అవ్వలకు కొడుకులాంటి సాయం
ఆసరా ఫించన్లు పేదలకు నిజంగానే ఆసరానిస్తున్నాయి. రూ.200 పెన్షన్‌ను రూ.2016కు పెంచారు. అంతే కాదు ఫించన్ దారుల సంఖ్య కూడా 26 లక్షల నుంచి 38 లక్షలకు పెరిగింది. సామాజిక పెన్షన్ల కోసం తెలంగాణ రూ.12 వేల కోట్లు ఖర్చుపెడుతోంది. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు అందిస్తోంది. తెలంగాణ వచ్చాక చేనేతన్నల తలరాత మారింది. తెలంగాణ ఆవిర్భవించిన తొలి ఐదేళ్లలో ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసింది.
బీడు భూముల్లో గోదారి పరవళ్లు
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రాంత వాసులు ఆరోపించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునేందుకు కేసీఆర్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రను ఒప్పించి గోదావరి నదిపై భారీ ఎత్తున కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. ఈ మధ్యే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. నీరు పల్లమెరుగును అని సామెత ఉండగా.. నీరు శిఖరాగ్రానికి చేరునూ… అన్నట్లుగా 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలను పంప్ చేస్తున్నారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తోంది. ఇక రైతుల కోసం రూ.5 లక్షల కవరేజీతో రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్క గుంట భూమి ఉన్న రైతు అయినా సరే ప్రమాదవశాత్తూ చనిపోతే.. బీమా మొత్తాన్ని అందజేస్తున్నారు.
ఐటీలో సాటిరాని
తెలంగాణ ఉద్యమం సమయంలో హైదరాబాద్‌లో ఐటీ రంగం వృద్ధి నిలిచిపోయింది. ఉద్యమాల కారణంగా ఐటీ కంపెనీలు కొత్త కార్యాలయాల ఏర్పాటుకు వెనుకడుగు వేశాయి. కానీ ఇది తాత్కాలికమే అని నిరూపిస్తూ.. ప్రత్యేక రాష్ట్రం అవతరించాక హైదరాబాద్ ఐటీ వేగంగా పురోగమిస్తోంది. బెంగళూరుకు ధీటుగా భాగ్యనగరం ఐటీ సంస్థలను ఆకర్షిస్తోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి ఏడాది రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.66 వేల కోట్లు ఉండగా.. 2019-20 నాటికి రూ. 1,28,807 కోట్లకు చేరాయి. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సైతం ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఐటీ రంగం ద్వారా తెలంగాణలో 5.80 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
నియామకాల్లేక.. నిరుద్యోగుల్లో నిరాశ
తెలంగాణ ఏర్పాటయ్యాక నీళ్లు, నిధుల సమస్య చాలా వరకు తగ్గింది. కానీ నియామకాల విషయంలో మాత్రం ఒకింత నిరాశే ఎదురైంది. తెలంగాణ వస్తే ఏమొస్తది అంటే ఇంటికో ఉద్యోగమొస్తదని నిరుద్యోగ యువత, తల్లిదండ్రులు ఆశించారు. కానీ తెలంగాణ ఏర్పాటై ఆరేళ్లు గడుస్తున్నా ఆశించిన రీతిలో నియామకాలు జరగలేదనేది వాస్తవం. తెలంగాణలో 2.86 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉండగా.. ఈ ఆరేళ్లలో 27 వేలకుపైగా మాత్రమే ఖాళీల భర్తీ జరిగిందని విద్యార్థి సంఘాలు వాదిస్తున్నాయి. కోర్టు కేసులతో టీఎస్‌పీఎస్సీ చేపట్టిన నియామకాలు ముందుకు కదలడం లేదు. జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అంతే కాదు నిరుద్యోగ భృతి ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. ఇప్పటికీ ఆ హామీని అమలు చేయడం లేదు. దీంతో నిరుద్యోగ యువత ఉద్యోగాల కల్పన విషయంలో తీవ్ర నిరాశతో ఉంది. ఇక డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం అమలు విషయంలోనూ ప్రజల్లో అసంతృప్తి ఉంది.
పెరుగుతున్న రుణ భారం
తెలంగాణ వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంపై అప్పుల భారం కొండలా పెరిగిపోయింది. 2019 సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ముందు ఉంచిన కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర రుణ భారం రూ. 1.42 లక్షల కోట్లు. కాగా 2014-19 మధ్య తెలంగాణ సర్కారు ప్రాజెక్టులపై రూ.79 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరం నాటికే తెలంగాణ అప్పుల భారం రూ. 2 లక్షల కోట్లు దాటిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక తెలంగాణపై రూ.75 వేల కోట్ల అప్పుల భారం ఉంటే.. ఈ ఆరేళ్లలోనే అవి రూ. 2 లక్షల కోట్లు దాటాయని ప్రతిపక్షం విమర్శిస్తోంది. 2024 నాటికి తెలంగాణ అప్పులు రూ. 5 లక్షల కోట్లకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, సంక్షేమం కోసం అప్పులు చేయడం తప్పు కాదంటోంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణ లాక్‌డౌన్ వల్ల ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
బంగారు తెలంగాణ దిశగా అడుగులు
గత ఆరేళ్లలో తెలంగాణపై అప్పుల భారం పెరగడమే కాదు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. నియామకాలు, అప్పులు పెరగడం, పేదలకు ఇళ్లు లాంటి అంశాల్లో అసంతృప్తులను మినహాయిస్తే స్థూలంగా చూస్తే.. గత ఆరేళ్లలో తెలంగాణ ప్రగతి పథంలో సాగింది. హైదరాబాద్ ఐటీ రంగం, పట్టణాల పురోగతి, పల్లెసీమల్లో రైతులకు భరోసా ఇవ్వడం, చేనేతలకు తోడుగా నిలవడం.. ఇలా అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకం పాటిస్తూ.. ఇది మన ప్రభుత్వం అనే భరోసాను ప్రజలకు కలిగించింది. తొలి ఆరేళ్లలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడ్డాయి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న థాశరథి మాటలను నిజం చేసే దిశగా తెలుగు రాష్ట్రం ముందుకెళ్తోంది.