శస్త్రచికిత్స లేకుండా తల గాయాన్ని నయం చేసిన అమోర్ ఆస్పత్రి వైద్యులు
నగరంలోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అయిన అమోర్ ఆస్పత్రిలో వైద్యులు ఎడమ భుజానికి అత్యంత ప్రమాదకరగాయం, తలకు కూడా గాయమైన 28 ఏళ్ల యువకుడికి విజయవంతంగా చికిత్స చేసినట్లు ప్రకటించారు. సాధారణంగా తల గాయాలకు శస్త్రచికిత్స చేస్తారు. కానీ, ఇక్కడ కేవలం సరైన మందులు వాడి, సహజమైన పద్ధతిలోనే గాయాన్ని నయం చేసే పద్ధతిని వైద్యులు ఎంచుకున్నారు. దాంతో బాధిత యువకుడు బాగా కోలుకున్నాడు.
రోజుకూలీ అయిన నరసింహులు మార్చి 9న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కోమా స్థితిలో ఉండగా అమోర్ ఆస్పత్రికి తీసుకొచచారు. అతడి జీసీఎస్ (గ్లాస్‌గో కోమా స్కేల్) స్థాయి 3/15 ఉంది. ఇది చాలా తక్కువ కావడంతో బతికే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలోనూ వైద్యులు చికిత్సకు వెనకాడకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా వెంటిలేటర్ మీద పెట్టి, రీససిటేషన్ ప్రారంభించారు.
రోగి పరిస్థితి, అతడికి చేసిన చికిత్స విధానం గురించి అమోర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిశోర్ బి.రెడ్డి మాట్లాడుతూ, “రోగి పక్కటెముకలు విరిగాయి, ఎడమ భుజం డీగ్లోవ్ అయింది, ఊపిరితిత్తుల్లోనూ గాయం ఉంది, తలకు పెద్ద గాయమైంది. తల నుంచి, భుజం నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతోంది. తల లోపల అంతర్గత రక్తస్రావం ఏమీ లేకపోవడంతో తలకు శస్త్రచికిత్స చేయలేదు. దానికి బదులు గాయాన్ని నయం చేయడానికి అత్యవసర మందులు వాడాం. అదే సమయంలో ‘కె’ వైర్ల సాయంతో భుజానికి అయిన గాయాన్ని తిరిగి సరి చేశాం. వెంటిలేటర్ మీద ఉన్న ఐదో రోజు కూడా రోగి కీలక పారామీటర్లు మారుతూ ఉన్నాయి, అతడికి పూర్తిస్థాయిలో ఇంకా శ్వాస ఆడట్లేదు. దాంతో అతడిని బోర్లా పడుకోబెట్టి వెంటిలేటర్ పెట్టాం. ఐదు రోజుల తర్వాత అతడి పరిస్థితి మెరుగవడం మొదలైంది” అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఆస్పత్రిలో మొత్తం 28 రోజుల పాటు రోగి ఉన్నాడు. ఆ సమయంలో భుజానికి డీబ్రైడ్‌మెంట్ ప్రక్రియను మూడు నాలుగు సార్లు చేశాం. వేరేచోట నుంచి చర్మాన్ని తీసి అతికించడంతో పాటు, మృదు కణజాలానికి అయిన గాయాన్ని వాక్యూమ్ సాయంతో మూసి నయం చేశాం. రోగి తన సొంత కాళ్ల మీద నడుస్తూ, చెప్పిన విషయాలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టగానే ట్రకియాస్టమీ ట్యూబు తీసేసి, అతడు సులభంగా నడిచేలా చేశాం” అని వివరించారు.
ఈ చికిత్స ప్రక్రియలో డాక్టర్ కిశోర్ బి రెడ్డితో పాటు క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ జయశేఖర్, డాక్టర్ ప్రత్యూష, న్యూరోసర్జన్ డాక్టర్ కేవీఆర్ శాస్త్రి, పల్మనాలజిస్టు డాక్టర్ రజని, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వాజిద్, నర్సింగ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సాధారణంగా కోమాలో ఉన్న వ్యక్తుల జీసీఎస్ స్కోరు 3 (పూర్తిగా స్పందించని స్థాయి) నుంచి 15 (స్పందించే స్థాయి) వరకు ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే చికిత్స చేయడానికి, ఆస్పత్రిలో చేరిన రోగులను పరీక్షిస్తూ వారి స్పృహ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోడానికి ఈ స్కోరు ఉపయోగపడుతుంది. ఈ కేసులో రోగి బతికే అవకాశాలు దాదాపు శూన్యం. అయినా, అతడి వయసు దృష్ట్యా అతడిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి వైద్యులు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు అతడు మళ్లీ మామూలు జీవితం గడపొచ్చు.