హ‌స్తానికి హ్యాండ్ ఇచ్చిన క‌పిల్ సిబ‌ల్

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇటీవ‌ల కాలంలో చాలా మంది సీనియ‌ర్ నాయ‌కులు పార్టీకి గుడ్‌బాయ్ చెప్పి ప‌క్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి క‌పిల్ సిబ‌ల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి సైకిల్ ఎక్కారు.

అయితే క‌పిల్ సిబ‌ల్ పార్టీ సీనియ‌ర్ నేత‌, గాంధీ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు, పేరు మోసిన న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్‌ పార్టీకి హ‌ఠాత్తుగా రాజీనామా చేసేశారు. చేయ‌డ‌మే కాదు.. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా… స‌మాజ్‌వాదీ పార్టీ మ‌ద్ద‌తుతో యూపీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యునిగా నామినేష‌న్ కూడా దాఖ‌లు చేసేశారు. నామినేష‌న్ దాఖ‌లు చేసే సమ‌యంలో క‌పిల్ సిబ‌ల్‌ వెంట స‌మాజ్‌వాదీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్‌, ఆ పార్టీ సీనియ‌ర్ నేత రాంగోపాల్ యాద‌వ్ కూడా ఉన్నారు. అంతేకాకుండా బుధ‌వార‌మే అధికారికంగా సిబాల్ స‌మాజ్‌వాదీ స‌భ్య‌త్వం కూడా తీసుకోనున్నారని స‌మాచారం.

కాగా.. తాను స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ దాఖ‌లు చేశాన‌ని, అయితే.. స‌మాజ్‌వాదీ పార్టీ త‌న‌కు మ‌ద్ద‌తిస్తోంద‌ని సిబ‌ల్‌ పేర్కొంటున్నారుసై. మ‌రో వాద‌న కూడా వుంది. స‌మాజ్‌వాదీ త‌ర‌పునే ఆయ‌న నామినేష‌న్ దాఖ‌లు చేశార‌ని, అతి త్వ‌ర‌లోనే ఆయ‌న స‌మాజ్‌వాదీ స‌భ్య‌త్వాన్ని కూడా తీసుకోనున్నార‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా క‌పిల్ మాట్లాడుతూ.. ఈ నెల 16న తాను కాంగ్రెస్‌కి రాజీనామా చేసేశాన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా ఓ ఫ్రంట్ క‌ట్టాల‌ని తాను భావిస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. పార్ల‌మెంట్‌లో ఇండిపెండెంట్ వాయిస్ అవ‌స‌రం ఎంతో వుంద‌ని, ఇలా స్వ‌తంత్ర స‌భ్యుడు ఏదైనా అంశాన్ని లేవ‌దీస్తే… ప్ర‌జ‌లు కూడా న‌మ్ముతార‌ని ప్ర‌క‌టించారు.

కొన్ని రోజులుగా అల‌క వ‌హించిన సిబ‌ల్‌
రాహుల్ గాంధీకి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌జెబుతార‌న్న వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ పార్టీ సీనియ‌ర్లు అధిష్ఠానంపై తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తారు. ఏకంగా జీ 23 పేరుతో ఓ జ‌ట్టు కూడా క‌ట్టేశారు. పార్టీలో అర్జెంట్‌గా నాయ‌క‌త్వ మార్పు ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఈ జ‌ట్టుకు సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్ నాయ‌క‌త్వం వ‌హించారు. సిబ‌ల్‌ కూడా ఇందులో వున్నారు.

ఈ నెల 16 నే పార్టీకి రాజీనామా చేసేశాన‌ని సిబాల్ ప్ర‌క‌టించారు. ఇన్ని రోజులు గ‌డ‌చినా.. ఈ వార్త బ‌య‌టికి మాత్రం పొక్క‌లేదు. అధిష్ఠానం కూడా స్పందించ‌లేదు. దీని వెనుక వున్న రాజ‌కీయ మ‌ర్మం మాత్రం అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కైతే క‌పిల్ సిబ‌ల్‌ రాజీనామాపై కాంగ్రెస్ స్పందించ‌లేదు.