ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్
ఎట్టకేలకు, ఎన్నో మలుపులు తిరిగిన నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది.
బెయిల్ నింబంధనలు
దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలి.
న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలి.
ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు.
దర్యాప్తును ప్రభావితం చేయకూడదు.
మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు.
గతంలో చూపించినట్లు తన గాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదు
నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం.
ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు రాఘురామను అరెస్ట్ చేశారు. ఇతరులతో కలసి కుట్రలు చేయడం (ఐపీసీ సెక్షన్ 120 బీ), ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం (124ఏ), ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా మాట్లాడటం (153ఏ), వ్యక్తిగత దూషణలు (505) తదితర అభియోగాల కింద అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. అయితే… ఆ నోటీసును తీసుకునేందుకుగానీ సంతకం చేసేందుకుగానీ రఘురామ అంగీకరించలేదని, ఆయన భార్య రమాదేవి కూడా నోటీసు తీసుకునేందుకు నిరాకరించడంతో… ఇంటి గోడకు అంటించామని పోలీసులు దానిపై రాశారు. ఆయనపై మంగళగిరి సీఐడీపోలీసులు కేసు (12/2021) నమోదు చేసినట్లు నోటీసులో ఉంది.