సీబీఐ అధికారి లక్ష్మీనారాయణకు తెదేపా ఆహ్వానం
తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లాలో అభ్యర్థుల ఖరారుకు ఇంకా కసరత్తు చేస్తోంది. ముందుగా ఎంపీ అభ్యర్థులను తేలిస్తే…వాటితో ముడిపడిన అసెంబ్లీ స్థానాలు ఒక కొలిక్కి వస్తాయని అధిష్ఠానం ఆ దిశగా ప్రయత్నిస్తోంది. విశాఖ ఎంపీగా గంటా శ్రీనివాసరావును పోటీ చేయాల్సిందిగా సూచించింది. ఆయన ఇష్టం లేకపోయినా…పార్టీ ఆదేశం శిరసావహించడానికి సన్నద్ధమయ్యారు. భీమిలిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. తాజాగా సీబీఐ అధికారి లక్ష్మీనారాయణను తెలుగుదేశంలోకి రావాలని ఆహ్వానించారు. ఆయన వస్తే..విశాఖ జిల్లా నుంచి పోటీకి దించాలని భావిస్తున్నారు. ఆయన స్థాయికి తగినట్టుగా విశాఖ ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుందని పార్టీలో పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆయన్ను విశాఖ ఎంపీగా నిర్ణయిస్తే, గంటా శ్రీనివాసరావు అసెంబ్లీకే పోటీ చేయాల్సి ఉంటుంది. అలాగైతే ఆయన అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.