భారత్ బంద్ కి తెరాస మద్దతు
రైతులకు అండగా ఉంటామని.. ఈ 8న తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణభవన్‌లో మంత్రి మీడియా ద్వారా మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ప్రదర్శిస్తున్న పోరాట పటిమకు సెల్యూట్ అన్నారు. ఈ దేశంలో రైతు లేకపోతే ఎవరికి అన్నం లేదనే విషయం తెలిసిందేనన్నారు. ఎన్నో పురోగమన చర్యలను తీసుకువచ్చిన రాష్ట్రంగా, ఒక అభ్యుదయ రైతుగా సీఎం కేసీఆర్ దేశంలోని రైతులకు సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారన్నారు. రైతుల పోరాట పటిమకు అందరి తరపున సెల్యూట్ చేస్తూ వారికి సంఘీభావంగా ఎల్లుండి జరిగే భారత్ బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా పాల్గొనాల్సిందిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జీలకు, పార్టీ అనుబంధ రైతు విభాగ కార్యకర్గ సభ్యులకు, రాష్ట్రవ్యాప్తంగా ఉండే రైతుబంధు సమితి సభ్యులకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు విజ్ఞప్తి..
అదేవిధంగా తెలంగాణ రైతాంగం పక్షాన కూడా ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలి కాబట్టి రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త, వాణిజ్యవేత్తకు తామో విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు సర్వసాధారణంగా ఉదయం 10 గంటలకు షాపులు తెరుస్తారు. కాగా భారత్‌బంద్ నేపథ్యంలో ఎల్లుండి మంగళవారం నాడు రైతులకి సంఘీభావంగా మరో రెండు గంటలు షాపులు తెరవకుండా ఉండాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో అక్కడ ఉండే వ్యాపారవేత్తలను పార్టీ శ్రేణులు కలిసి విజ్ఞప్తి చేయాల్సిందిగా సూచించారు.
కార్పొరేట్లకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేసే కుట్ర..
కార్పొరేటర్లకు వ్యవసాయాన్ని ధారాదత్త చేసే కుట్ర జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో రైతన్న ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల ఏ రకంగా అన్యాయం జరగబోతుంది. కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో వ్యవసాయం ఏ రకంగా బందీ కాబోతుంది. ఈ నల్ల చట్టాల వల్ల కనీసం మద్దతు ధర కూడా రాకుండా కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నింది. వీటన్నింటిని ఎండగాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు. వ్యాపార, వాణిజ్య వేత్తలతో పాటు ట్రాన్స్పోర్లు కూడా బంద్‌కు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం తర్వాతే తమ కార్యకలాపాలు కొనసాగించాల్సిందిగా కోరారు. భారత్ బంద్ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరపున తాము రెండు కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు మంత్రి తెలిపారు. ఒకటి వ్యాపార, వాణిజ్యవేత్తలు రైతులకు సంఘీభావంగా షాపులను మధ్యాహ్నం తర్వాతనే తెరిచేలా కోరడం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జాతీయ రహదారుల మీద పార్టీ ప్రజాప్రతినిధులు మోహరించి రాస్తారోకో, ధర్నా చేసి రైతులకు సంఘీభావం ప్రకటించడం అని పేర్కొన్నారు.