హరీష్ రావు వి చిల్లర రాజకీయాలు : రఘునందన్ రావు
దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధిగా తన గెలుపు నిశ్చయమవ్వడంతో హరీశ్ రావు తట్టుకోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ధ్వజమెత్తాడు. హరీశ్ రావు మొదటి నుంచి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట అని , ఇప్పుడు ఆయన ఆటలు సాగవని రఘునందన్ రావు హెచ్చరించారు. నెల రోజులుగా తిరిగిన ప్రతీ గ్రామంలో టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల వాళ్లు బీజేపీ గెలుపు కోసం మద్దతుగా పార్టీలో చేరుతున్నారని … టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని ఇంటెలిజెన్స్ నివేధిక కూడా రావడంతో దిక్కుతోచని హరీశ్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని దెప్పిపొడిచారు. రాయపోల్ మండలం తమ్మక్కపళ్లిలో సర్పంచ్ కు పోటీ చేసిన అశోక్ రెడ్డి తో పాటు ఇతర గ్రామస్తులు బీజేపీ లో చేరడంతో గ్రామం మొత్తం బీజేపీ వైపుకు మారిందన్న అక్కసుతో హరీశ్ రావు తన వందిమాగదులకు మందు తాగించి బీజేపీ మీటింగ్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. గ్రామస్థులే హరీశ్ రావు పంపిన వారి మీద తిరగబడి మీటింగ్ ను గ్రామ ప్రజలు విజయవంతం చేశారని రఘునందన్ రావు తెలిపారు. కావాలంటే తటస్థ మీడియా వచ్చి గ్రామంలో పర్యటన చేస్తే తెలుస్తుందని , టీఆర్ఎస్ పార్టీ కి బాకా ఊదే డబ్బా పెట్టె చానల్, వారి కరపత్రం పేపర్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలను దుబ్బాక ప్రజలు నమ్మరని, ఎప్పుడో దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ ఓటమికి కంకణం కట్టుకున్నారని రఘునందన్ రావు వెల్లడించారు .