సెప్టెంబర్ చివర్లో కరోనా అదుపులోకి
సెప్టెంబర్ నెల చివరికి కరోనా వైరస్ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా పూర్తిగా అదుపులో ఉందని, కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. కొద్ది రోజుల్లో ఇంకా తగ్గుతాయని, వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వైరస్ అదుపులోకి వస్తుందని తెలిపారు. సర్కారు సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే ప్రజలు కొద్దిరోజుల్లో సాధారణ జీవితం గడిపే పరిస్థితులు వస్తాయన్నారు. బయట నుంచి తీసుకొచ్చే సామాన్లను శానిటైజ్ చేయనవసరం లేదన్నారు. వాటి నుంచి కరోనా సోకే ప్రమాదం చాలా తక్కువన్నారు. అలా అని జాగ్రత్తలు తీసుకోకపోతే అసలు రాకుండా ఉండదన్న గ్యారంటీ లేదని హెచ్చరించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం 2 వేల మంది వైద్య సిబ్బంది మహమ్మారి బారినపడ్డారని ఆయన వివరించారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. సీజనల్ వ్యాధుల లక్షణాలు, కరోనా లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయని, అందువల్ల ప్రజలు ఏమాత్రం అనారోగ్యం బారినపడినా పరీక్షలు చేయించుకోవాలన్నారు.