క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు 15 వేలు : సీఎం

కరోనా బాధితులకు ఏ ఆస్పత్రికి కూడా వైద్యం నిరాకరించరాదని, అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. కోవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తామన్నారు. ఇటువంటి ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కోవిడ్‌ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు, కేసుల వివరాలను ముఖ్యమంత్రికి అధి​కారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
క్వారంటైన్‌ సెంటర్లు..
క్వారంటైన్‌ సెంటర్ల మీద ఫోకస్‌ పెంచాలని, వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని సీఎం వైస్‌ జగన్‌ ఆదేశించారు. భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. ‘‘వచ్చే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్‌ చేయాలి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాలలో మంచి ప్రమాణాలు పాటించేలా చేయాల్సిన బాధ్యత అధికారులదే. అందుకు ఎలాంటి మార్పులు చేయాలన్నా చేయండి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాల
నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్‌ సెంటర్‌ నంబర్‌తో కూడిన హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలి. ఫీడ్‌బ్యాక్‌ కోసం ప్రతి రోజూ ప్రతి సెంటర్, ఆస్పత్రికీ కాల్స్‌ చేయాలి. ప్రతి క్వారంటైన్‌ కేంద్రం, కోవిడ్‌ కేర్‌ సెంటర్,కోవిడ్‌ ఆస్పత్రులకు కచ్చితంగా ర్యాండమ్‌గా కనీసం 3 ఫోన్‌ కాల్స్‌ చేయాలి.క్రమం తప్పకుండా ఆ ఆసుపత్రులను, క్వారంటైన్‌ సెంటర్లను పర్యవేక్షించాలని’’ సీఎం పేర్కొన్నారు.
కోవిడ్‌ ఆస్పత్రులు..
కోవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలపై పూర్తి దృష్టి పెట్టండి. జీఎంపీ ప్రమాణాలున్న మందులు వాటిలో చికిత్స పొందుతున్న వారికి అందాలి. రానున్న కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వైద్యులు, నర్సులు..
కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు సన్నద్ధం కావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి అనుసరిస్తున్న ప్రణాళికను సీఎం అడిగి తెలుసుకున్నారు. విపత్తు సమయంలో వారు సేవలందిస్తున్నందున వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలని సీఎం తెలిపారు. అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది డేటా బేస్‌ సిద్ధం చేశామని వెల్లడించారు. కనీసం 17 వేలకు పైగా డాక్టర్లు, 12 వేలకు పెగా నర్సుల సేవలు పొందేందుకు ప్రణాళిక రూపొందించి.. కోవిడ్‌ విస్తృతి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారి సేవలు వినియోగించుకుంటామని ముఖ్యమంత్రికి అధికారులు తెలపగా, ఆ ప్రణాళికకు సీఎం వైఎస్‌ జగన్‌ అంగీకారం తెలిపారు.