వాళ్లు చేతకానీ దద్దమ్మలు : బండి సంజయ్
దమ్ము, ధైర్యం లేని చేతకాని దద్దమ్మలు టీఆర్ఎస్ నేతలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు పహారా మధ్య బతుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న ప్రజా ఉద్యమాలతో టీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందని, దీంతో వారు ప్రజల్లో తిరగలేకపోతున్నారని చెప్పారు. వరంగల్ లోని బీజేపీ ఆఫీసుపై, ఎంపీ ధర్మపురి అర్వింద్ తోపాటు తమ పార్టీ నేతలపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడికి పోలీసులు సహకరించారని ఆరోపించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక సెగ తగలకుండా ఉండేందుకు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల మద్దతు, వారిచ్చిన బలంతోనే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇళ్ల వద్ద సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయని చెప్పారు. టీఆర్ఎస్ నాయకుల దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ రూల్స్ కు లోబడే ఆందోళనలు చేశామన్నారు.