గడీల కోటలు కూడ గట్లనే కూలుతాయి : తెజస
పనిమంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే.. పుటుక్కున కూలిందట…. అట్లుంది కేసీఆర్ ఎవ్వారం అని ఎద్దేవా చేశారు మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి. కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి బయట పడుతున్నాయన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు పోయే కాలువకే పెద్ద గండి పడిందన్న ఆయన… కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదని అప్పుడే రెండు ప్రధాన కాలువలు గండ్లు పడ్డాయన్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే , కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు పోయే కాలువ పనుల్లోనే నాణ్యత ఇంత ఘోరంగా ఉంటే.. ఇక రాష్ట్రంలో జరిగిన కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ నిర్మించున్న గడీల కోటలు కూడా అదే విధంగా కూలేందుకు సమయం ఆసన్నమైందని విమర్శించారు.