అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి

రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్కు వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, కె.ఆర్. సురేశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఎసిబి డిజి పూర్ణచందర్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫజీయుద్దీన్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, నాగేందర్, ఆత్రం సక్కు, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో, ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండేదని, నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలేనో అగ్రగామిగా ఉందని సిఎం అన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్ భగీరథతో ఆ సమస్య పరిష్కారం అయిందన్నారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటి తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమయిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటు పడడం కోసం ప్రభుత్వం పునరంకితం అవతుందని సిఎం ప్రకటించారు.