వలస కార్మికులకు ఇబ్బందులు రానీయం : ఎమ్మెల్యే రజని
వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. చిలకలూరిపేట మండలంలోని వలస కూలీల శిబిరాలను చూసేందుకు శనివారం ఆయన బొప్పూడి, ఫార్‌కార్నర్ కు వచ్చారు. ఆయనతోపాటు చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని కూడా ఉన్నారు. తన సొంత వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిబిరం వద్ద గత ఎనిమిది రోజులుగా రోజుకు 500 మంది వలస కూలీలకు ఎమ్మెల్యే ఉచితంగా వైఎస్సార్ అన్నదానం పేరుతో నిత్యాన్నదానం చేస్తున్నారు. కలెక్టర్ గారితోపాటు ఎమ్మెల్యే విడదల రజిని శనివారం ఫార్‌కార్నర్ వద్ద వలస కూలీలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వలస కూలీలను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి వలస కూలీలను తరలిస్తోందన్నారు. ఇప్పటికే దాదాపు 40 రైళ్ల ద్వారా 50వేల మందిని వారి వారి సొంత ఊర్లకు చేర్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు లక్షన్నర మంది వలస కార్మికులను సురక్షితంగా వారి వారి రాష్ట్రాలకు తరలించామన్నారు. జిల్లాలో ఇంకా మిగిలిపోయిన కార్మికులను కూడా త్వరితగతిన వారి రాష్ట్రాలకు తరలిస్తామని చెప్పారు.