కంటైన్మెంట్ ఏరియాలు తప్ప అన్నీ గ్రీన్ జోన్లే: కేసీఆర్
రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే తెలంగాణలోనూ 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1,452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ ఏరియాలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో లాక్‌డౌన్ మార్గదర్శకాలను సీఎం వివరించారు. ‘‘కంటైన్మెంట్ ఏరియాలో ప్రభావం ఉన్న పరిసరాల్లోనే లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. పూర్తిగా పోలీసు పహారాలోనే కంటైన్మెంట్ ఏరియా ఉంటుంది. కరోనాకు వ్యాక్సిన్ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని ప్రపంచం అంగీకరించింది. కరోనాతో కలసి జీవించడం నేర్చుకోవాలి. బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలి. కంటైన్మెంట్ ఏరియాలో ఉండే కుటుంబాలకు నిత్యావసరాలు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.