ఇవాళ సీఎంలతో మరోసారి ప్రధాని సమావేశం

లాక్‌డౌన్‌ 3.0 ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో మరోసారి మాట్లాడనున్నారు. ఇవాళbమధ్యాహ్నం మూడు గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. రేపటి సమావేశంలో కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. గత సమావేశంలో కేవలం ప్రధాని, హోంమంత్రి మాత్రమే పాల్గొన్నారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం ఇది ఐదోసారి.

లాక్‌డౌన్‌ వైదొలిగే అంశం, ఆర్థిక గాడిన పెట్టే వ్యూహం తదితర అంశాలపై ప్రధాని సీఎంలతో సమాలోచనలు జరపనున్నారు. గత సమావేశంలో కేవలం 9 మంది ముఖ్యమంత్రులకే మాట్లాడే అవకాశం ఇవ్వగా.. ఈ సారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడనున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లు, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో ఇవాళ ఉదయం కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా మాట్లాడారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీల రాకతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వారు ఈ భేటీలో ఆందోళన వ్యక్తంచేసినట్లు సమాచారం. దీంతో ఆయా జిల్లాలు రెడ్‌జోన్లుగా మారుతున్నాయని చెప్పినట్లు తెలిసింది. ఇలాగైతే సాధారణ స్థితికి చేరుకోవడం కష్టమేననన్న భావన వారి నుంచి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇదే అంశం రేపటి ముఖ్యమంత్రులతో సమావేశంలోనూ చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.