ఏం నిర్ణయిస్తారు.

కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకోసం ప్రధాని ఆత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షలను సడలిస్తారా అనేది కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఈ క్రమంలోనే శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆయన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ భేటీతో అయ్యారు. లాక్‌డౌన్‌పై అనుసరించాల్సిన వ్యూహాలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కరోనాపై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవడమన్న రెండు అంశాలు అమీతుమీ తేల్చేస్తాయని అభిప్రాయపడ్డారు. రైల్వే, విమాన ప్రయాణం, అంతర్రాష్ట బస్సు సర్వీసులను మే నెల మొత్తం బంద్‌ చేయడమే మేలని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీ శనివారం ప్రసంగంలో చర్చించే అవకాశం ఉంది.