అనుకున్నది ఒక్కటి అయినది మరొక్కటి
భారతదేశంలో మొదటి కరోనా కేసు పుట్టినది అక్కడే అదే మన భూతాల స్వర్గంగా పిలిచే కేరళ. అయితే అక్కడ తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కొన్ని సడలింపులు చేస్తూ లాక్ డౌన్ కి ఎత్తి వేయడానికి ప్రయత్నం చేసారు. అయితే ఇప్పుడు అక్కడ అనుకున్నది ఒక్కటి అయినది మరొక్కటి అన్నచందంగా మారింది. కరోనాను కేరళ రాష్ట్రం జయించిందన్న వార్తల నేపథ్యంలోనే ఆ రాష్ట్రంపై కరోనా మళ్లీ పంజా విసిరింది. మంగళవారం ఒక్కరోజే కేరళలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఒక్క కన్నూర్‌లోనే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
పాలక్కడ్‌లో నాలుగు, కాసర్‌గోడ్‌లో మూడు, మలప్పురం, కొల్లాంలో ఒక్కో కేసు నమోదైంది. గత కొద్ది రోజులుగా కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. దీంతో.. కేరళలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అంతా భావించారు. అయితే.. మంగళవారం ఒక్కరోజే 19 కేసులు వెలుగుచూడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే.. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ మందికి ట్రావెల్ హిస్టరీ ఉందని అధికారులు తేల్చారు. పాజిటివ్ కేసులు పెరగడంపై సీఎం పినరయ్ విజయన్ స్పందించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మార్చి 12 నుంచి ఏప్రిల్ 21 మధ్య కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ టెస్టులు చేశామని ఆయన ప్రకటించారు. హాట్‌స్పాట్‌లను గుర్తించిన ఆరోగ్య శాఖ అధికారులు ఆ ప్రాంతాలను పూర్తిగా సీల్ చేశారని, కేవలం కొన్ని మెడికల్ దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచినట్లు సీఎం తెలిపారు. కన్నూర్‌లో ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపై కనిపిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని.. దయచేసి మే 3 వరకూ ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే.. కేరళలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టుండి పెరగడానికి సోమవారం ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపే కారణంగా తెలుస్తోంది. లాక్‌డౌన్ సడలించడంతో ఆయా ప్రాంతాల్లో జన సంచారం పెరిగింది. క్షౌరశాలలు, రెస్టారెంట్లు, బుక్ షాపులు, సరి-బేసి విధానంలో ప్రైవేట్ వాహనాలకు అనుమతినివ్వడంతో కొన్ని గంటల్లోనే ప్రజలు రోడ్ల మీదకొచ్చారు. పాజిటివ్ కేసులు పెరగడానికి ఇదొక కారణంగా తెలిసింది. కోవిడ్ -19 లాక్‌డౌన్ మార్గదర్శకాలలో కేరళ ప్రభుత్వ సడలింపులపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి సడలింపులను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.