అర‌వింద్‌పై దాడి ఆర్మూర్‌లో కాదు గ‌న్నారంలోనే జ‌ర‌గాల్సింది – ఎమ్మెల్యే బాజిరెడ్డి

అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ అర‌వింద్‌పై జ‌రిగిన దాడి దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. అయితే ఈ దాడి అధికార పార్టీ నాయ‌కులు చేయించార‌ని ఎంపీ అరవింద్ ఆరోపించారు. కాదు రైతులు దాడి చేశార‌ని తెరాస మంత్రులు, ఎమ్మెల్యే అన్నారు.

అయితే కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ మాట్లాడుతూ నోటికెంత వస్తే అంత మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టే ఆర్మూర్‌లో దాడి జరిగిందన్నారు. వాస్తవానికి గన్నారంలోనే జరగాల్సిందని, సీఎంతో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను తిడుతుంటే కొట్టడం కరెక్ట్ అని సమర్థించుకున్నారు. బీజేపీ నాయకులకు ఎదురు తిరగాలని, ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తమ ఆట మొదలైందని, కేసీఆర్‌ను విమర్శిస్తే వేటాడి వెంటాడుతామని హెచ్చరించారు.