ప‌డి లేచిన టీంఇండియా

న్యూజిల్యాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ ఆరంభంలోనే భార‌త్‌కి గ‌ట్టి షాక్ త‌గిలింది. అయితే వెంట‌నే తేరుకున్న బ్యాట్స్‌మెన్ వెంట‌వెంట‌నే వికెట్లు ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ముంబయిలో జరుగుతున్న టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 120 పరుగులతోనూ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీమిండియా కోల్పోయిన 4 వికెట్లు కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఖాతాలోకి చేరాయి. కొన్ని బంతుల వ్యవధిలోనే ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (44), ఛటేశ్వర్ పుజారా (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) వికెట్లను చేజిక్కించుకున్న అజాజ్ పటేల్… ఆ తర్వాత ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ వికెట్ కూడా సాధించాడు. తొలి టెస్టులో సెంచరీ సాధించిన అయ్యర్ ఈసారి 18 పరుగులు చేశాడు.

ఓ దశలో 80 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను మయాంక్-అయ్యర్ జోడీ 160 పరుగుల వరకు చేర్చింది. అయ్యర్ అవుటైన తర్వాత మయాంక్ కు సాహా జత కలిశాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 200 మార్కు దాటించారు.