షర్మిల వదులుతున్న బాణం ప్రశాంత్ కిషోర్

తెలంగాణలో రాజకీయ కాకా అప్పుడే మొదలైంది. సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా… రాజకీయ పార్టీలు అప్పుడే గెలుపు ఎలా వస్తుందో అని ఆలోచిస్తున్నారు. ఇందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే…

రాజకీయాలు పూర్తి భిన్నం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడి రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌దే పూర్తి ఆధిపత్యం.

మధ్య మధ్యలో ఇతర పార్టీలు కొంత మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్‌దే పైచేయి అని చెప్పకతప్పదు. తెలంగాణలో వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్.. రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కొంతమేర బలపడ్డ బీజేపీ.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ కూడా అధికారం కోసం రేసులో నిలిచాయి. ఇక తీన్మార్ మల్లన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వైఎస్ షర్మిల కూడా రాజ్యాధికారం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న కేసీఆర్‌ను దెబ్బకొట్టడం అంత ఈజీ కాదనే వాదన ఉంది. ఇందుకోసం కేసీఆర్‌ను మించి వ్యూహాత్మకంగా ఆలోచించే వ్యూహకర్త కావాలన్నది పలువురి అభిప్రాయం. ఇదిలా ఉంటే ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టేలా వ్యూహాలు రచించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ త్వరలోనే తెలంగాణపై ఫోకస్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన వైఎస్ షర్మిల  పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారని ప్రచారం సాగుతోంది.

ఇందుకోసం ఇప్పటికే ఆయన కసరత్తు పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చి ఈ మేరకు పని మొదలుపెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో రాజన్న(వైఎస్ రాజశేఖర్ రెడ్డి) తెస్తామంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. త్వరలోనే పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆమెకు ఆశించిన స్థాయిలో పొలిటికల్ మైలేజీ వచ్చిన దాఖలాలు మాత్రం పెద్దగా లేవనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగి తెలంగాణలో వైఎస్ షర్మిల సారథ్యంలో వైఎస్ఆర్‌టీపీని రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీగా మారుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిశోర్ ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు.

2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడం వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణమని వేరే చెప్పనవసరం లేదు. అలాంటి ప్రశాంత్ కిశోర్.. తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అధికార చేజిక్కించుకునేందుకు దోహదం చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే మరికొద్ది నెలల్లోనే దీనిపై క్లారిటీ రావొచ్చు. అక్టోబర్‌లో తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించిన వైఎస్ షర్మిల.. అంతకంటే ముందుగానే ప్రశాంత్ కిశోర్ తమ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తారో లేదో అనే అంశంపై స్పష్టత ఇవ్వొచ్చని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి తనదైన వ్యూహాలతో అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించేలా చేసిన ప్రశాంత్ కిశోర్ వైఎస్ షర్మిల పార్టీ కోసం పని చేస్తే.. తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.