తెరాస నేత సామ కాంగ్రెస్‌లోకి

ఎన్నిక‌లకు రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉన్నా… అప్పుడే వ‌ల‌సలు మొద‌లైనాయి. అధికార పార్టీ తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు వెళ్తున్నారు. తెరాసలో త‌గిన న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని అందుకే పార్టీ మారుతున్నామ‌ని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సామ వెంకట్‌రెడ్డి సహా మండలి కార్యవర్గ సభ్యులందరూ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే వారంతా కాంగ్రెస్ గూటికి చేరన్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంకట్‌రెడ్డి ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా తాను పనిచేసినట్టు చెప్పారు. తమ సంఘానికి 33 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయని, దాదాపు 40 వేల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఉద్యమకారులు నిరాశలో కూరుకుపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంకట్‌రెడ్డి సహా కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్‌ను కలిశారని, ముఖ్యనాయకులతో చర్చించిన అనంతరం వారిని పార్టీలో చేర్చుకోనున్నట్టు చెప్పారు.