స్త్రీకి వైద్యం చేయ‌డం గొప్ప అనుభూతినిస్తోంది : డా. వ‌సుంధ‌ర‌

పురుటి నొప్పుల‌తో బాధ‌పడుతున్న‌ప్పుడు అన్ని తాపై పురుడుపోస్తోంది. పుట్టిన నాటి నుండి త‌నువు చ‌లించే వ‌ర‌కు ఇబ్బంది వ‌చ్చిన మొద‌ట మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది డాక్ట‌రే. నిజంగా ఈ డాక్ట‌ర్ అనే వారు లేకుంటే… మ‌నం ఎప్పుడు క‌నుమ‌రుగై పోయోవాళ్లం.

గుండె మీద స్టెత్ పెట్టిన‌ప్ప‌టి నుండి మ‌రే ప‌ర్వాలేదు అని గుండె నిండా ధైర్య‌మిచ్చి డిశ్చార్జ్ చేసే వ‌ర‌కు తొడుడేది డాక్ట‌ర్‌. అందుకే వారికి శ‌త‌కోటి వంద‌నాలు. పెద్దలు అనాడు చెప్పారు ‘వైద్యో నారాయణో హరి’ అని ఎందుకన్నారో అర్థమవుతుంది. దేవుడు కరుణ మాత్రమే చూపుతాడు. వైద్యం మాత్రం మీరే చేసి ప్రాణం పోయాలి.

డాక్ట‌ర్ నీకు సెల్యూట్‌
ఇవాళ మనందరం తిరుగుతున్నామన్నా, ప్రాణాలతో ఉన్నామన్నా, ఈ క్షణాన ఇది చదువుతున్నామన్నా మనకు ఎవరో ఒక డాక్టర్‌ జన్మించడానికి సహాయం చేయడం వల్లే. బాల్యంలో, ఎదిగే వయసులో జ్వరాలు వచ్చినా, వాంతులు వచ్చినా, విరేచనాలు అయినా, ఆడుకుంటూ కింద పడ్డా, బండి మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నా, కంటి నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, ఒంటి మీద ఏదో మచ్చ వచ్చినా… డాక్టరు మనకు మందు చీటి రాసి ఆ సమస్యను దూరం చేయడం వల్లే.

మనలో కొందరు నాస్తికులుగా ఉండవచ్చు. జీవితంలో ఒక్కసారి కూడా గుడీ, మసీదు, చర్చ్‌లకు వెళ్లకపోయి వుండవచ్చు. కాని ఆ నాస్తికులు కూడా ఏదో సందర్భంలో హాస్పిటల్‌ మెట్లు ఎక్కకుండా జీవితాన్ని దాటలేరు. వైద్యుడు లేని చోటు ను చప్పున వదిలిపెట్టాలని శతకకారుడు చెప్పాడు. మనిషి నివసించాలంటే వైద్యుడు ఉండాలి. మంచి వైద్య సదుపాయం అందుబాటులో ఉన్న ఊరే అభివృద్ధి చెందే ఊరు. ప్రజలు వచ్చి స్థిరపడే ఊరు.

ఫ్యామిలీ డాక్టర్‌
ఈ సమాజం సమాజంగా రూపుదిద్దుకోవడం మొదలెట్టాక ప్రతి కుటుంబం ఆ ఊరిలోని దేశీయ వైద్యుడికి పరిచయంగా ఉండేది. ఇంగ్లిష్‌ వైద్యం మొదలయ్యి ఆధునికంగా మారే కొద్దీ వైద్యుల సంఖ్య పెరిగి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్‌ ఏర్పడటం మొదలయ్యింది. ఫ్యామిలీ డాక్టర్‌ అంటే మరెవరో కాదు… మనకు గురి కుదిరిన, అందుబాటులో ఉండే, కష్టం సుఖం ఎరిగి మాట్లాడి పంపే వైద్యుడు. తరాలు గా ఈ ఫ్యామిలీ డాక్టర్ల మీద నమ్మకంతోనే ఎందరో తమ ఆరోగ్యం గురించి చింత లేకుండా జీవించారు. వీరు మరే డాక్టర్‌ దగ్గరికీ వెళ్లరు ఎంత గొప్ప డాక్టరు ఉన్నాడని చెప్పినా. ఫ్యామిలీ డాక్టర్‌ చేతి మాత్ర వేసుకుంటే టక్కున లేచి కూచుంటారు.

హస్తవాసి
ఊళ్లో ఎందరు డాక్టర్లు ఉన్నా కొందరి ‘హస్తవాసి’ మంచిదని జనంలో పేరొస్తుంది. ఆ పేరు ఒకరో ఇద్దరో ఇవ్వరు. ఊరంతా కట్టకట్టుకుని ఇస్తుంది. ఆ ‘హస్తవాసి’ బాగున్న డాక్టర్‌ దగ్గరికే క్యూ కడతారు. బహుశా ఆ డాక్టర్‌ మాటతీరు, జబ్బును అంచనా కట్టే పద్ధతి, వైద్యం చేసే విధానం హస్తవాసిని తీసుకు వస్తుందేమో. ‘అందరి చుట్టూ తిరిగి మీ హస్తవాసి మంచిదని వచ్చాం డాక్టర్‌’ అని ఈ డాక్టర్లను సంప్రదించడం ఆనవాయితీ.

వైద్యులు పలు రకాలు
మనుషుల్లో రకాలు ఉన్నట్టే వైద్యుల్లో రకాలు ఉంటారు. ముక్కోపి డాక్టర్లు, దూర్వాస డాక్టర్లు, సరదా డాక్టర్లు, అస్సలు మాట్లాడని డాక్టర్లు, చాలా మాట్లాడే డాక్టర్లు, మందు చీటిని పై నుంచి కింద దాకా నింపే డాక్టర్లు, ఒకటో అరా మాత్రలు మాత్రమే రాసే డాక్టర్లు, ఖరీదైన మందులు రాసే డాక్టర్లు, రూపాయి రెండు రూపాయల మందులు మాత్రమే రాసే డాక్టర్లు, మతి మరుపు డాక్టర్లు, అతి తెలివి డాక్టర్లు… ఎన్నో రకాలుగా ఉంటారు. వారు ఎన్ని రకాలుగా ఉన్నా సామాన్యులు వారి ప్రతిభను, నైపుణ్యాన్ని, అనుభవాన్ని గమనించి రోగిని డాక్టర్లు భరించినట్టు భరిస్తుంటారు. ఊళ్లల్లో కొన్ని రకాల స్పెషలిస్టులు ఉంటారు. అంటే వీరు పి.జి చేసినవారని కాదు అర్థం. ఉదాహరణకు పురుగుల మందు తాగినవాళ్లను బతికించే స్పెషలిస్ట్‌ ఉంటాడు ఊళ్లో. ఎవరు పురుగు మందు తాగినా అతని దగ్గరికే తీసుకెళతారు. గుండెపోటు వస్తే కాపాడే డాక్టర్‌ వేరే. ఎవరు గుండె పట్టుకున్నా ఈ డాక్టరు పరిగెత్తాల్సిందే.

మహమ్మారి–త్యాగం
హాస్పిటల్‌లో విధి వశాత్తు ప్రాణాలు పోయిన రోగులు ఉంటారు. వైద్యం చేస్తూ డాక్టర్లు మరణించరు. కాని మహమ్మారి కాలంలో రోగులూ వారికి వైద్యం చేసే డాక్టర్లూ మరణించే విషాద సన్నివేశం చూశాం. మహమ్మారి కాలంలో ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా వేలాది డాక్టర్లు రోగుల ప్రాణాలు కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టారు. దేశ వ్యాప్తంగా వందల్లో డాక్టర్లు గత రెండేళ్లలో కరోనా వల్ల మరణించారు. బతికిన వారంతా ఆ వైద్యులకు రుణగ్రస్తులే.

మారుతున్న బంధం
పూర్వం సొరకాయలు, పొట్లకాయలు ఫీజుగా ఇచ్చే అమాయక గ్రామీణులు ఉండేవారు. రోగుల ఇళ్ల శుభకార్యాలకు హాజరయ్యే డాక్టర్లు ఉండేవారు. ఇవాళ ఈ బంధం కొంచెం పలుచబడింది. ఆర్థికపరమైన అంశమే రోగికి డాక్టరుకు మధ్య ప్రధానంగా మారిందనే అపవాదు వినవస్తూ ఉంది. కార్పొరెట్‌ వైద్యం పట్ల ఎంత నమ్మకం ఉందో అంతే అభ్యంతరం కూడా ఉంది. వైద్యం అంత ఖరీదు కావడం పట్ల, డాక్టరు అందరానివాడు కావడం పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉండటం సహజమే. మానవీయత ఏమైనా కొరవడుతోందా అనేది ఇప్పుడు సమీక్షించుకోవాల్సిన అంశం. కాని ప్రతి మంచి వైద్యుడు తన అంతరాత్మ ఎదుట రోగి పక్షానే ఉంటాడు. అలాంటి ప్రతి వైద్యునికి కృతజ్ఞత ప్రకటించాల్సిన రోజు ఇది.

డా. వ‌సుంధ‌ర‌, క‌న్స‌ల్టెంట్ గైన‌కాల‌జిస్ట్‌, సికింద్రాబాద్.

మారుతున్న జీవ‌న విధానంలో అనేక‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వాటి కోసం ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య విద్య‌ను అభ్య‌సిస్తూ ప్రాణాలు కాపాడుతున్నాం. ఒక స్త్రీగా… ఇంకో స్త్రీకి మ‌రోజ‌న్మ‌నిచ్చే ప్ర‌స‌వాల‌కు వైద్య చేయ‌డం గొప్ప అనుభూతి. అంద‌రికీ డాక్ట‌ర్స్ డే శుభాకాంక్ష‌లు.