దీదీ, ప‌వ‌ర్ భేటీల‌పై రాజ‌కీయ ఉత్కంఠ‌త‌

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలిశారు. బుధవారం నిర్వహించబోయే వివక్షాల సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆమె పవార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల రేసులో విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలిపే ప్రయత్నంలో భాగంగా ఆమె భేటీ నిర్వహించనున్నారు. బుధవారం నిర్వహించబోయే ఈ విపక్షాల సమావేశానికి 22 మంది నేతలను ఆహ్వానించారు సీఎం మమతా బెనర్జీ.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కేరళ సీఎం విజయన్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రే, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌లకు ఆహ్వానం పంపారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి సైతం ఆహ్వానం పంపారు దీదీ. ప్రతిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేష్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జీవాలే భేటీకి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యమయ్యాయనే.. సంకేతాన్నిపార్టీలు చూపిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రేపటి భేటీకి ఎవరెవరు హాజరవుతారనే చర్చ జోరుగా నడుస్తోంది.