మ‌ల్లారెడ్డిని త‌రిమి త‌రిమి కొట్టిన రెడ్డి సంఘం నాయ‌కులు

తెలంగాణ రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డిని సొంత వ‌ర్గం నాయ‌కులే అత‌నికి చుక్క‌లు చూపించారు. స్టేజి మీద మాట్లాడుతుంటే మైకు లాక్కొని త‌మ వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేశారు. అంతేకాకుండా మంత్రి కాన్వాయిని అడ్డుకొని నిర‌స‌న తెలిపి వెనుతిరిగేలా చేసి రెడ్డి సంఘం ఐక్యత‌ను చాటుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే…
ఘ‌ట్‌కేస‌ర్‌లో రెడ్డి సింహ‌గ‌ర్జ‌న సభ ఏర్పాటు చేశారు.

రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా 5000 కోట్ల‌తో రెడ్డి సంఘం కార్పొరేష‌న్ ఏర్పాటు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా
రెడ్డి జాగృతి ఆధ్వ‌ర్యంలో ఆదివారం ఘ‌ట్‌కేస‌ర్‌లో రెడ్డి సింహ‌గ‌ర్జ‌న పేరుతో స‌భ ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంఘం నాయ‌కులు దాదాపు ల‌క్ష మంది ఈ స‌భ‌లో పాల్గొన్న‌ట్లు అంచ‌నా. అయితే ఈ స‌భ‌కు ప్ర‌త్యేక అతిధిగా మంత్రి మ‌ల్లారెడ్డికి ఆహ్వానం అందించారు.

మ‌ల్లారెడ్డి మైక్ ప‌ట్టుకొని మాట్లాడ‌డం ప్రారంభించారు. రెడ్డిలు ఐక్య‌త‌తో ఉండాల‌ని, రెడ్డి సంఘం కార్పొరేష‌న్ కోసం కృషి చేస్తాన‌ని అన్నారు. అనంత‌రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో రెడ్డిలు ఉన్నార‌ని ఇప్ప‌డు అభివృద్ధి అంతా తెరాస పార్టీ వ‌ల్లే జ‌రుగుతుంద‌ని, అన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయ‌ని తెలిపారు. అయితే ఇలా మాట్లాడుతున్న త‌రుణంలో స‌మావేశ స్టేజీ మీద నుండి కింద ఉన్న రెడ్డి సంఘం నాయ‌కుల నుండి పెద్ద ఎత్తున్న వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో మధ్యలోనే ప్రసంగం ఆపేసి మంత్రి మల్లారెడ్డి పారిపోయారు.

మంత్రి స్టేజి మీద నుండి కిందికి దిగి కారులో వెళ్తున్న త‌రుణంలో రెడ్డి సంఘం నాయ‌కులు మంత్రి కాన్వాయిపై కుర్చీలు, వాట‌ర్ బాటిల్, చెప్పుల‌తో ఇలా చేతికి ఏదీ వ‌స్తే దానితో మంత్రి కారుపై దాడి చేశారు.

ఈ సంద‌ర్భంగా ఏఎస్‌రావు న‌గ‌ర్‌కు చెందిన రెడ్డి సంఘం నాయ‌కులు సోమ‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం స‌మావేశానికి వ‌చ్చిన మంత్రి ప్ర‌భుత్వం గురించి మాట్లాడ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాజ‌కీయాలు వేరు కుల సంఘాలు వేరు. కాబ‌ట్టి త‌మ రెడ్డిల ఐక్య‌త కోసం తాము ప్ర‌త‌య్నం చేస్తుంటే… ఒక మంత్రి హోదాలో ఉన్న ఆయ‌న త‌మ‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌కుండా… తెరాస ప్ర‌భుత్వం యొక్క ప‌థ‌కాలు గురించి చెప్ప‌డం సిగ్గుచేట‌న్నారు. ముఖ్య‌మంత్రి పొగుడుకోవాలంటే ఆయ‌న ఇంటి దగ్గర ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుకొని మాకు అభ్యంత‌రం లేదు కానీ ఇక్క‌డకి వచ్చి కేసీఆర్‌ని ఎలా పొగుడుతారు అని ప్ర‌శ్నించారు.