సంక్లిష్టమైన చికిత్సలు చేసి మహిళ ప్రాణాలు కాపాడిన డాక్ట‌ర్ త్రిపుర సుంద‌రి

  • గర్భాశయ ముఖద్వారం వద్ద ఏర్పడిన పిండం
  • పూర్తిగా ఏర్పడలేక.. సమస్యలు, తీవ్ర రక్తస్రావం
  • ప్రాణాపాయ స్థితిలో కిమ్స్కు వచ్చిన మహిళ
  • ఎంబొలైజేషన్, హిస్టరెక్టమీలతో ప్రాణాలు కాపాడిన వైద్యులు

గర్భసంచిలో ఏర్పడాల్సిన గర్భం.. గర్భాశయ ముఖద్వారం వద్ద ఏర్పడి, ఆ విషయం తెలియక ఐదోనెలలో రక్తస్రావం అవుతుండటంతో అబార్షన్ అనుకుని వైద్యుల వద్దకు వెళ్లి దాదాపు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ మహిళను కిమ్స్ ఆస్పత్రి వైద్యులు రక్షించారు. ఈ వివరాలను కిమ్స్ ఆస్పత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ త్రిపుర సుందరి వివరించారు.

“తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాంతానికి చెందిన కరుణ అనే మహిళకు ఇప్పటికే ఒక బిడ్డ ఉండగా, ఏడాదిన్నర లోపే రెండోసారి గర్భం వచ్చింది. సాధారణంగా గర్భసంచిలో రావాల్సినది గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చింది. దాంతో బిడ్డ ఏర్పడలేదు గానీ, ప్లెసెంటా బిట్స్ అంతా అటూ ఇటూ రక్తాన్ని పీల్చుకుని అక్కడ ఎదగడం మొదలైంది. మొదటిసారి సిజేరియన్ కావడంతో అప్పుడు ఏర్పడిన మచ్చమీద రెండోసారి గర్భం వచ్చి కూర్చుంది. ఇలాంటి సందర్భాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ, ఆమె తొలిసారి చూపించిన ఆస్పత్రితో పాటు ఖమ్మం ఆస్పత్రిలోనూ సరైన చికిత్స అందలేదు. ఖమ్మం ఆస్పత్రిలో ఎంఆర్ఐ తీసి చూసి, తొలుత లాప్రోస్కొపీ ద్వారా క్లీన్ చేయడానికి ప్రయత్నించారు. కుదరకపోవడంతో శస్త్రచికిత్స ద్వారా చేద్దామని ఓపెన్ చేశారు. కానీ అప్పుడూ సాధ్యం కాకపోవడంతో మళ్లీ కుట్లు వేసి, హైదరాబాద్ వెళ్లాల్సిందిగా సూచించారు. ఆమె సోదరుడు మెడికల్ రిప్రజెంటేటివ్ కావడంతో కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణంగా అయితే ఇలాంటి కేసుల్లో సంక్లిష్టమైన పలు రకాల చికిత్సలు అందించాల్సి ఉంటుంది కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుందని, అందువల్ల గాంధీ ఆస్పత్రికి వెళ్లమని సూచించినా, కాదని ఇక్కడే చేయించుకుంటామన్నారు. దాంతో కిమ్స్ ఆస్పత్రి MD డాక్టర్ భాస్కరరావుతో మాట్లాడి సాయం చేద్దామని నిర్ణయించాం.

ఇక్కడ ఎంఆర్ఐ చేసి చూస్తే, లోపల రక్తస్రావం చాలా తీవ్రంగా ఉంది. దాంతో ఎంబొలైజేషన్ అనే అధునాతన ప్రక్రియ చేయాల్సి వచ్చింది. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు డాక్టర్ అనంతరాము ఈ ప్రక్రియ చేశారు. ఇలాంటివి చిన్న చిన్న ప్రభుత్వాస్పత్రుల్లో చేయలేం. సి-ఆర్మ్ పెట్టుకుని, యాంజియోగ్రామ్ చూసుకుంటూ రక్తనాళాల్లోకి ఫ్లూయిడ్ పంపారు. అప్పుడు అవి బ్లాక్ అయిపోయి, రక్తస్రావం ఆగుతుంది. ఇలాంటి పెద్ద వాస్క్యులర్ ట్యూమర్లు తాను ఇంతవరకు చూడలేదని, ఒక వెజెల్ బాంబులా ఉందని ఆయన చెప్పారు. సాధారణంగా ఈ ప్రక్రియకే లక్షన్నర వరకు అవుతుంది. కానీ, ఇక్కడ తక్కువ ఖర్చుకే అది కూడా చేశాం. కానీ, రక్తస్రావం 70-80% వరకు మాత్రమే ఆగడంతో వెంటనే శస్త్రచికిత్స చేయడం కుదరలేదు. 48 గంటల పాటు అలా వేచి ఉన్న తర్వాత అప్పుడు శస్త్రచికిత్స మొదలుపెట్టాం. లోపల బ్లాడర్ అంతా అతుక్కుని ఉంది. దానికి అక్కడ ఉండే మూత్రనాళాలు కూడా అతుక్కుపోవడంతో మిగిలిన విభాగాల నిపుణుల సాయంతో వాటిని వేరుచేసి.. అప్పుడు గర్భసంచిని తొలగించాం. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు రెండున్నర గంటలకు పైగా సమయం పట్టింది. చివరకు బ్లాడర్ను వేరుచేసి, దాన్ని కుట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలిగాం.

అక్టోబర్ నుంచి ఈ సమస్య ఆమెకు మొదలైనా, సరైన చికిత్స పొందకపోవడంతో ఇంత వరకు వచ్చింది. ఎబొలైజ్ చేయకుండా ఉంటే అసలు రక్తస్రావం ఆగేది కాదు, చివరకు ప్రాణాపాయానికి కూడా దారితీసేది. ఇలాంటి గర్భాలు శస్త్రచికిత్సలు చేసిన 2,500 మందిలో ఒకరికి వస్తాయి, అలాగే సాధారణ గర్భాల్లో 9000 మందిలో ఒకరి వస్తుంది. ఇంతదూరం పెరిగేది 10వేల కేసుల్లో ఒకటి ఉంటుంది. అసలు మొదటి 3-6 వారాల సమయంలో ఒకసారి స్కాన్ చేసి చూస్తే విషయం తెలిసిపోయేది. అప్పుడు కేవలం మందులతోనే కరిగించే అవకాశం ఉండేది. ఇంత తీవ్ర సమస్య అయ్యేది కాదు. గర్భం వచ్చినట్లు తెలిసిన తొలివారాల్లోనే ఒకసారి స్కాన్కు వెళ్తే విషయాలు తెలుస్తాయి. చాలామంది ఐదోనెల వరకు వెళ్లక్కర్లేదని ఇంట్లో కూర్చుంటారు. దాంతో ఇలాంటి సమస్యలు వస్తాయి. సాధారణ ఆస్పత్రులలో ఇలాంటి చికిత్సలు చేయలేము. కిమ్స్ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యనిపుణులు ఉండటంతో పాటు అత్యాధునిక సదుపాయాలు ఉండటం వల్లే ఇదంతా సాధ్యమైంది, చివరకు రోగి ప్రాణాలు కాపాడగలిగాం” అని డాక్టర్ త్రిపురసుందరి వివరించారు.