స్టేట్ గాలరీ అఫ్ ఆర్ట్‌లో ఫోటో ఎగ్జిబిష‌న్

డెక్క‌న్ న్యూస్‌, జ‌న‌ర‌ల్ బ్యూరో:
వైవిధ్య భరిత కళాత్మక గ్యాలరీలను నిర్వహించడంలో దేశంలోనే ప్రముఖ స్థానంలో ఉంది ఆర్ట్ హౌజ్ సంస్థ. చెన్నై మరియు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ట్ హౌజ్ , సమకాలీన కళలకు సంబంధించి అనేక కోణాలను ఆవిష్కరించే ప్యాన్ ఇండియా మ్యాగజైన్ ఆర్ట్ ఇల్లుస్ట్రేటెడ్ తో కలిసి మొట్టమొదటి సారిగా ట్రావెల్ షోతో పాటు ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది.
దేశ వ్యాప్తంగా వంద మంది కళాకారుల ప్రతిభను ఒక్కచోట చేర్చుతూ ఏఐ 100 పేరుతో గతేడాది ఈ సంస్థ కాఫీ టేబుల్ పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఆ వందమంది కళాకారుల్లో విజయ్ పిచుమణి, దాన్ ప్రసాద్ కూడా ఉన్నారు. ఇటీవలే ఈ పుస్తకాన్ని చెన్నైలో ఆవిష్కరించారు. ఇప్పుడు ఇది హైదరాబాద్ కళా ప్రియుల మనసు దోచుకోబోతోంది. ఏప్రిల్ 1 నుంచి 9 వరకు జూబ్లీహిల్స్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో దీనిని ప్రదర్శిస్తున్నారు. పూర్ణిమ శివరామ్ గారి నేతృత్వంలో దీనిని నిర్వహిస్తున్నారు.

ఏఐ 100 పుస్తకం , కళాకారులు తమ కాన్వాస్ తో జరిపే భావోద్వేగ సంభాషణలకు ప్రతిరూపం. తమ సంస్కృతిని పరిరక్షిస్తూ, తమ చుట్టూ ఉన్న సమూహంతో , ప్రాంతాలతో ఉన్న బంధాన్ని వ్యక్తీకరిస్తూ సమకాలిన అంశాలకు కళాకారులు ఇచ్చిన దృశ్య రూపమే ఈ పుస్తకం. ఆర్ట్ ఇల్లుస్ట్రేటెడ్ మ్యాగజైన్ భావాలకు అనుగుణంగా ఏఐ 100 పుస్తకం దృశ్య కళలను లోతుగా అన్వేషించి అంతర్జాతీయ మరియు సమకాలీన దృష్టి కోణాన్ని అందిస్తోంది. సాంస్కృతిక యవనికను ప్రభావితం చేస్తున్న ఎన్నో ఆలోచనల సమాహారంగా ఈ పుస్తకం అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందించింది.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉదిత్ దుగర్ , ఆర్ట్ హౌజ్ సీఎండీ విన్సెంట్ అదైకలరాజ్ తో కలిసి ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉదిత్ దుగర్ మాట్లాడుతూ ” ఇలాంటి కళా ప్రదర్శనలను విన్సెంట్ ప్రోత్సహించడం చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఈ ప్రదర్శనలో ప్రత్యక్షంగా పాల్గొని వీటిని ఆస్వాదించే అవకాశం దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ ప్రతిభను ఆవిష్కరించుకోవడానికి ఏఐ 100 ఎంతో దోహదం చేస్తోంది. ఈ తరహా కార్యక్రమం హైదరాబాద్ లో జరగడం ఇదే తొలిసారి. కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు విన్సెంట్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంలో మేం కూడా భాగస్వాములైనందుకు ఆనందంగా ఉంది “

ఆర్ట్ హౌజ్ ఎండీ విన్సెంట్ అదైకలరాజ్ మాట్లాడుతూ ” వర్థమాన కళాకారులు , మరీ ముఖ్యంగా దక్షిణాది కళాకారుల ప్రతిభను ప్రోత్సహించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. మా ట్రావెల్ షోలో హైదరాబాద్ రెండో మజిలీ మాత్రమే. దేశం వ్యాప్తంగా ఇలాంటి షోలు మరిన్ని నిర్వహిస్తాం “